రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 22 మంది మూడు మినీ లారీల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. వారిని రాణిగారితోట వద్ద పోలీసులు అడ్డుకుని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించారు. కరోనా లక్షణాలేవీ బయటపడలేదు.
కర్ణాటక నుంచి హిందూపురం మీదుగా అనంతపురం జిల్లాకు రావడానికి ప్రయత్నించారు. కొడికొండ, తూముకుంట, కంచిసముద్రం చెక్‌పోస్టుల వద్దకు ప్రజలు భారీగా వాహనాల్లో చేరుకోగా పోలీసులు తిప్పి పంపించారు.
కర్నూలు జిల్లాకు చెందిన కూలీలు గుంటూరు నుంచి కర్నూలుకు ట్రక్కుల్లో వెళ్తుండగా వారిని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపేశారు. వారంతా ఆకలితో నకనకలాడారు. విశాఖ నుంచి వచ్చిన ఎనిమిది మందిని ఒంగోలులో అడ్డుకుని కందుకూరు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం నారాయణపేట వద్ద బెంగళూరు నుంచి జిల్లాలోకి వచ్చేందుకు ప్రయత్నించిన వ్యక్తులు, వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా అల్లీపురం, గురపట్లగూడెం చెక్‌పోస్ట్‌ల వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని అడ్డుకున్నారు.
తెలంగాణలోని మట్టపల్లి వద్ద ఏపీలోకి వెళదామని వచ్చిన వారిని తంగెడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 200 మంది వరకు రాగా, ద్విచక్ర వాహనాలున్న వారు తిరిగి వెళ్లిపోయారు. 30 కుటుంబాలు వేచి చూస్తున్నాయి. పిల్లలు ఆకలికి అలమటిస్తుండగా... స్థానికులు పులిహోర, మజ్జిగ ఇచ్చారు. తిరిగి వెళ్లాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
కదిలారో... చర్యలు తప్పవు..!
విదేశాల నుంచి వచ్చి గృహ నిర్బంధంలో (హోమ్ క్వారంటైన్)లో ఉంటున్నవారు ఇళ్లు దాటి బయటకొచ్చినా, అందుకు ప్రయత్నించినా పసిగట్టే యాప్‌ను పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. హోమ్ క్వారంటైన్‌లో ఉండేవారి ఇళ్లను పోలీసులు జియోట్యాగింగ్ చేస్తున్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారు ఇంటి నుంచి బయటికొస్తే ఆ సమాచారం తక్షణమే కంట్రోల్‌రూమ్‌కు చేరుతుంది. నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని స్వీయ నిర్బంధంలో ఉండేలా చేసేందుకు దీని వల్ల అవకాశమేర్పడుతుంది. ఆజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తారు. ‘హౌస్ క్వారంటైన్’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌లో శుక్రవారం ఒక్క రోజే ఐదు వేల మంది వివరాలు నమోదు చేసి వారి ఇళ్లను జియోట్యాగింగ్ చేశారు. శుక్రవారంనాటికి మరో 20 వేల మంది ఇళ్లను జియోట్యాగింగ్ చేయనున్నారు.