కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను సాధ్యమైనంత మేర కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో అసెంబ్లీ సమావేశాల వ్యవధిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి సమావేశాల తొలిరోజే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రి మండలి.. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమై బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనుంది.
సమావేశాలు జరిగేదిలా..
- ఉదయం 10 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం.
- గవర్నర్ ప్రసంగం ఉభయ సభల్లోనూ తెరలపై సభ్యుల వీక్షణ. అనంతరం ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదం. తర్వాత బీఏసీ సమావేశం.
- మధ్యాహ్నం ఒంటిగంటకు ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కన్నబాబు ప్రవేశపెడతారు.
- మండలిలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక్కడ వ్యవసాయ బడ్జెట్‌ను పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు.
- మధ్యాహ్నం 2.45 గంటలలోపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం.
- బడ్జెట్‌పై ఉభయ సభల్లోనూ బుధవారం చర్చిస్తారు. ద్రవ్య వినిమయ బిల్లుకు అదేరోజు ఉభయ సభలు ఆమోదం తెలుపుతాయి.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం
ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్... వీడియో కాల్ ద్వారా ప్రసంగించనున్నారు. కోవిడ్ దృష్ట్యా ఉభయ సభ సభ్యులూ వేర్వేరుగానే ఆయా సభల్లో ప్రసంగానికి హాజరు కానున్నారు. ఈ మేరకు శాసనసభ, మండలిలో వేర్వేరుగా గోడ తెరలను ఏర్పాటు చేశారు.
పరీక్షల ఆధారంగా జాగ్రత్తలు
శాసనసభ, మండలిలోకి సభ్యులను మాత్రమే అనుమతిస్తారు. సభ్యులు వారి జిల్లాల్లోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అలా చేయించుకోలేకపోయిన వారికి శాసనసభ ఆవరణలో ట్రూనాట్ పరీక్షలు చేయాలని యంత్రాంగానికి నిర్దేశించారు.