ఇది విజయవాడ డీజిల్ లోకో షెడ్. బెజవాడ రైల్వేస్టేషన్‌కు సమీపంలో.... 40 ఏళ్ల కిందట ఏర్పాటు చేశారు. డీజిల్‌తో నడిచే రైలింజన్లకు ఎలాంటి మరమ్మతు వచ్చినా.... ఇక్కడి నిపుణులు సకాలంలో తిరిగి పట్టాలెక్కిస్తారు. గుంటూరు, విజయవాడ డివిజన్ల పరిధిలో వేల రైలింజన్లకు మరమ్మతులు చేసిన ఈ కేంద్రం... కొద్దిరోజుల కిందటే 2 రైలింజన్లను కలిపే సాంకేతికత రూపొందించి భళా అనిపించుకుంది. ఈసారి.... ఇంధనం పొదుపులో జాతీయస్థాయి అవార్డు సాధించి మరోసారి ప్రత్యేకత చాటుకుంది.
లోకోషెడ్‌లో రైలు ఆగేందుకు భారీ షెడ్లు, మరమ్మతుల కేంద్రాలు, యంత్రాలు, క్రేన్లు ఉన్నాయి. లోకోషెడ్ ఏర్పాటైన నాటి నుంచి వీటన్నింటికీ సాధారణ విద్యుత్‌నే వినియోగిస్తున్నందు వల్ల... బిల్లులు నెలకు లక్షల్లో వచ్చేవి. ఇంధనం పొదుపు చేయాలన్న రైల్వేశాఖ ఆదేశాలతో... ఇక్కడి అధికారులు పొదుపు మార్గాలపై దృష్టి పెట్టారు. కార్యాలయంలో సాధారణ ఫిలమెంట్ లైట్లు, ట్యూబ్‌లైట్ల స్థానంలో... ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. ఎవరూ లేనప్పుడు వాటంతటవే ఆగిపోయేలా బీఎల్డీసీ ఫ్యాన్లకు సెన్సార్లు అమర్చారు. క్రేన్లు, భారీ యంత్రాలు, నీటి శుద్ధికేంద్రాల్లోని మోటార్లలో... ఇంధనం పొదుపు కోసం ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేశారు.