పంచాయతీ ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. హైకోర్టుకి ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెల 3 లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి, నివేదిక ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. న్యాయ నిపుణుల సలహాతో ప్రాథమికంగా అంచనాకి వచ్చాక సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. 2018 ఆగస్టు 1తో పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసినా.. ఎన్నికల్లో రిజర్వేషన్లపై సందిగ్ధత కారణంగా అప్పటి నుంచీ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 60.52 శాతం రిజర్వేషన్లతో ఉమ్మడి రాష్ట్రంలో 2013లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. తదుపరి ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో... తెలంగాణలో ఈ ఏడాది నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం అమలు చేయక తప్పలేదు. రాష్ట్రంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది. దీనిపై కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారుల బృందం గురువారం న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్లు సమాచారం. రిజర్వేషన్లు 60.52 శాతం అమలు చేస్తే న్యాయపరంగా ఎదురయ్యే ఇబ్బందులు, 50 శాతానికి పరిమితం చేస్తే ఎన్నికల్లో పోటీ చేసే బీసీల ప్రాతినిధ్యం తగ్గొచ్చన్న పలు విషయాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఆధారంగా అధికారులు ఉన్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయనున్నారు.
పంచాయతీ రిజర్వేషన్లపై కసరత్తు మొదలు - పంచాయతీ రిజర్వేషన్లపై కసరత్తు మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పంచాయతీ ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెల 3 లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి హైకోర్టుకు నివేదిక ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పంచాయతీ రిజర్వేషన్లపై కసరత్తు మొదలు
Last Updated : Dec 6, 2019, 9:05 AM IST