తెలుగు నేలపై ఆవిర్భవించిన తొలి బ్యాంకు.. ఆంధ్రాబ్యాంకు. తెలుగువారి ఇంటింటికీ పరిచయమే. డబ్బులు వేయాలన్నా...తీయాలన్నా.. ఈ బ్యాంకు తప్ప మరొకటి లేదు. అయితే ఎన్నో ఏళ్లుగా ముడిపడి ఉన్న ఎమోషన్ ఇక తెగిపోనుంది. ఆంధ్రా బ్యాంకు పేరు.. ఇక చరిత్రలో నిలిచిపోనుంది. ఆంధ్రాబ్యాంక్ యూనియన్ బ్యాంక్లో వీలినమైంది. అయితే ఒక్కసారి ఆంధ్రాబ్యాంకు ప్రస్థానం గురించి తెలుసుందాం..
లక్షతోనే ప్రారంభం
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంకును స్థాపించారు. 1923 నవంబర్ 20న ఆంధ్రాబ్యాంకు పేరు రిజిస్టర్ అయింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం(బందరు) ప్రధాన కేంద్రంగా పురుడుపోసుకుంది. లక్ష రూపాయల మూలధనం, రూ.10 లక్షల అధీకృత మూలధనంతో 1923 నవంబర్ 28న కార్యకలాపాలు ప్రారంభించిన ఈ బ్యాంకు ఎన్నో సేవలు అందించింది. తెలుగు వాడు ఎక్కడున్న ఈ బ్యాంకు పేరు సుపరిచితమే. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో.. 1980లో ఈ బ్యాంకును జాతీయం చేశారు. భారతీయ బ్యాంకింగ్ రంగానికి సాంకేతికతను పరిచయం చేసింది ఆంధ్రాబ్యాంకే. దేశంలోనే తొలిసారి క్రెడిట్ కార్డులను జారీ చేసిన బ్యాంక్ కూడా ఇదే. ఇలా చరిత్రలో నిలిచిపోయే.. పనులెన్నో.. ఉన్నాయి ఆంధ్రాబ్యాంకు ఖాతాలో.
ఒకే ఒక్కడు
పట్టాభి సీతారామయ్య పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను (ఒకప్పుడు కృష్ణా జిల్లా) గ్రామంలో జన్మించారు. 1901లో మద్రాస్ మెడికల్ కళాశాలలో వైద్య విద్య పూర్తి చేసి మచిలీపట్నంలో వైద్యుడిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. అలా లక్ష రూపాయలు పోగుచేసి ఆంధ్రాబ్యాంకును స్థాపించారు. దీనితో పాటు కృష్ణా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు, చైతన్య గోదావరి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా గాంధీతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆయనతో కలిసి సత్యాగ్రహం ఉద్యమంలోనూ పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 'జన్మభూమి' అనే పత్రికను కూడా నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను ప్రామాణికంగా అక్షరబద్దం చేసిన తొలివ్యకి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. 1952-57 వరకు మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. 1959 డిసెంబర్ 17న కన్నుమూశారు.
ఇదీ చదవండి: ఆంధ్రాబ్యాంకు విలీనం వల్ల లాభమే...నష్టం లేదు: కేంద్ర ఆర్థిక మంత్రి