ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Expenditure details: బడ్జెట్​లో కేటాయింపు ఒకలా... ఖర్చు మరోలా... - ఏపీలో సమతూకం కొరవడిన రెవెన్యూ, మూల ధన వ్యయాలు

AP Budget‌ Expenditure details: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, మూల ధన వ్యయాల కింద చేస్తున్న ఖర్చులో సమతూకం కొరవడింది. సాగునీటి ప్రాజెక్టులు, ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఆస్తుల కల్పనకు ఉపయోగపడే మూలధన వ్యయంలో ప్రభుత్వం బాగా వెనుకబడింది. ఆరు నెలల బడ్జెట్‌ వ్యయానికి సంబంధించి రాష్ట్ర ఆర్థికశాఖ ఇటీవల శాసనసభకు సమర్పించిన వివరాలు దీనిని వెల్లడించాయి.

AP Budget‌ Expenditure details
AP Budget‌ Expenditure details

By

Published : Jan 4, 2022, 7:49 AM IST

AP Budget‌ Expenditure details: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, మూల ధన వ్యయాల కింద చేస్తున్న ఖర్చులో సమతూకం కొరవడింది. సాగునీటి ప్రాజెక్టులు, ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఆస్తుల కల్పనకు ఉపయోగపడే మూలధన వ్యయంలో ప్రభుత్వం బాగా వెనుకబడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీనికి కేటాయించిన మొత్తంలో 6 నెలలు తిరిగేసరికి నాలుగో వంతైనా ఖర్చు చేయలేదు. ఎంతో కీలకమైన జల వనరులు, వైద్య, ఆరోగ్యం వంటి రంగాల్లోనూ ఈ పద్దు కింద ఖర్చు నామమాత్రమే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బహిరంగ మార్కెట్‌ రుణంలో కొంత శాతాన్ని దీనితోనే ముడిపెట్టింది. జీఎస్‌డీపీలో 4 శాతం బహిరంగ మార్కెట్‌ రుణం తెచ్చుకునే వెసులుబాటు ఉండగా 0.5 శాతాన్ని.. మూలధన వ్యయంలో నిర్దేశిత లక్ష్యానికి చేరుకుంటేనే తీసుకోవాలని షరతు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఆరు నెలల బడ్జెట్‌ వ్యయానికి సంబంధించి రాష్ట్ర ఆర్థికశాఖ ఇటీవల శాసనసభకు సమర్పించిన వివరాలు దీనిని వెల్లడించాయి.

రెవెన్యూ వ్యయంలో..

వేతనాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, నిర్వహణ ఖర్చులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ఇతర గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వ్యయాలు రెవెన్యూ వ్యయంలోకి వస్తాయి. అవికాక మౌలిక వసతుల కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, ఆస్తుల కల్పనకు అయ్యే ఖర్చంతా మూలధన వ్యయంగా పరిగణిస్తారు. 2021-22 బడ్జెట్‌లో మొత్తం మూలధన కేటాయింపులు రూ.31,198.38 కోట్లు. మొదటి ఆరు నెలల్లో వ్యయం రూ.6,711.60 కోట్లు (21.51%) మాత్రమే. మొత్తం రూ.1,82,196.54 కోట్ల రెవెన్యూ కేటాయింపుల్లో, ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు ఆరు నెలల్లో చేసిన వ్యయం రూ.98,012.31 కోట్లు (53.79%).

  • రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సాగునీటి ప్రాజెక్టులపై పెద్దగా ఖర్చు చేయలేదని లెక్కలు చెబుతున్నాయి. జల వనరులశాఖకు వివిధ హెడ్‌ల కింద బడ్జెట్‌లో మొత్తం రూ.13,237.75 కోట్లు కేటాయించారు. దీనిలో మూలధన కేటాయింపులు రూ.11,593.32 కోట్లు కాగా, మొదటి ఆరు నెలల్లో రూ.1,729.84 కోట్లు (14.92%) ఖర్చు చేశారు. జల వనరులశాఖకు బడ్జెట్‌ కేటాయింపుల్లో రెవెన్యూ, మూలధన వ్యయాలు కలిపి మొదటి ఆరు నెలల్లో ఖర్చు పెట్టింది 19.20 శాతమే. పోలవరం ప్రాజెక్టుకు రూ.4793.76 కోట్లు కేటాయించగా తొలి త్రైమాసికంలో రూ.500 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.606.20 కోట్లు ఖర్చు పెట్టారు.
  • వ్యవసాయ, అనుబంధ రంగాలు, మార్కెటింగ్‌, సహకారశాఖల బడ్జెట్‌ కేటాయింపుల్లో మొత్తం 25.23 శాతమే ఖర్చు పెట్టారు. రెవెన్యూ వ్యయంలో 25.17 శాతం, మూలధన వ్యయంలో 26 శాతం ఖర్చయింది.
  • వైద్య, ఆరోగ్యశాఖ (వైద్య విద్యతో కలిపి) మూలధన కేటాయింపులు రూ.2,464.63 కోట్లు కాగా, ఆరు నెలల్లో ఖర్చు రూ.383.33 కోట్లే.
  • పురపాలకశాఖకు మూలధన కేటాయింపులు రూ.1362.7 కోట్లు కాగా, తొలి ఆరు నెలల్లో రూ.294.47 కోట్లే (21.61%) ఖర్చు చేశారు.

మూలధన వ్యయం నామమాత్రంగా ఉన్న కొన్ని శాఖలు

  • మార్కెటింగ్‌శాఖకు రూ.100.10 కోట్లు కేటాయించగా, మొదటి 6 నెలల్లో రూపాయీ ఖర్చు పెట్టలేదు.
  • కుటుంబ సంక్షేమశాఖకు రూ.152.65 కోట్లు కేటాయించగా, తొలి త్రైమాసికంలో ఒక్క రూపాయీ ఖర్చు పెట్టలేదు. రెండో త్రైమాసికంలో రూ.84 లక్షలే ఖర్చు పెట్టారు.
  • ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్‌) విభాగానికి రూ.142 కోట్లు కేటాయించగా, తొలి త్రైమాసికంలో రూ.4.95 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.68 లక్షలు వెచ్చించారు.
  • ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌కు రూ.61.20 కోట్లు కేటాయించగా, ఆరు నెలల్లో చేసిన వ్యయం రూ.2.01 కోట్లే.
  • సైనికుల సంక్షేమానికి 4.50 కోట్లు కేటాయించగా, ఆరు నెలల్లో ఒక్క రూపాయీ వ్యయం చేయలేదు.
  • హోంశాఖ పరిధిలోని పోలీసుల ఇంటెలిజెన్స్‌ విభాగానికి సంబంధించి మొత్తం మూలధన కేటాయింపుల్లో 90 శాతం తొలి త్రైమాసికంలోనే ఖర్చు చేశారు. మొత్తం రూ.126.53 కోట్లు కేటాయించగా తొలి 3 నెలల్లో రూ.114.04 కోట్లు వెచ్చించారు. రెండో త్రైమాసికంలో ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదు.

ఇదీ చదవండి:CM Jagan Meet PM Modi: ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి ఊరట: ప్రధానికి సీఎం జగన్ వినతి

ABOUT THE AUTHOR

...view details