వచ్చే మూడేళ్లలో 55 వేల ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కొత్త ఐటీ విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. 2025 నాటికి దేశంలో ఐటీ పరిశ్రమ 350 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశముందని ఇందులో సింహభాగం ఏపీకి దక్కేలా మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. క్లౌడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డాటా అనాలసిస్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోనూ.. ఐటీ ఆధారిత పౌర సేవల్ని విస్తృతం చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో 3 ఐటీ కాన్సెప్ట్ సిటీలు సిద్ధం చేసి.. మౌలిక సదుపాయలు కల్పించనున్నారు. డిజిటల్ లైబ్రరీలు, పంచాయతీల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం లాంటి కార్యాచరణ చేపట్టనున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్సింగ్ డేటా బేస్‌తో పాటు వర్క్‌ఫ్రమ్ ఎనీవేర్ నినాదంతో మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్టార్టప్‌లను ప్రోత్సహించేలా కార్యాచరణను సిద్ధంచేశారు. ఐటీ పరిశోధన విశ్వవిద్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నూతన ఐటీ విధానం ద్వారా మూడేళ్లలో 55 వేల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే పన్నుల రూపేణా ఏడాదికి 783 కోట్ల రూపాయల వరకూ ఆదాయం వచ్చే అవకాశముందని భావిస్తోంది. అలాగే ప్రత్యక్ష ఉద్యోగాల ద్వారా 2200 కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు రాష్ట్రంలో జరిగవచ్చని అంచనా. అలాగే ఐటీఈకో సిస్టం ద్వారా పరోక్షంగా 1.6 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించే అవకాశముందని భావిస్తోంది.