రేపు జరగనున్న పరిషత్ ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహ్ని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కును ఉపయోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. ఓటు వేసే సమయంలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు, శానిటైజర్లు వినియోగం సహా తగు భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రేపు పోలింగ్ దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడారు. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా అంశాలపై సమీక్షించారు. అవసరమైన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బలగాలను మోహరించాలని ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిపేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.