ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆంధ్రాబ్యాంక్​'... ఇక కనపడదు - Andhra Bank

దశాబ్దాల చరిత్ర ఉన్న ఆంధ్రాబ్యాంక్​ పదం ఇక మనకు వినపడదు. ఏళ్ల తరబడి ఖాతాదారులకు సేవలందిస్తూ వచ్చిన ఈ బ్యాంక్​ పేరు ఇక ఎక్కడా కనపడదు. స్వాతంత్య్ర సమర యోధుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్​... యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కానుంది. ఆంధ్రాబ్యాంక్​ స్థానంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు కనిపించనుంది. దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్న ఆంధ్రాబ్యాంక్​... ఆంధ్రా కోడలిగా పిలుచుకునే నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో కనుమరుగవుతోంది.

ఆంధ్రాబ్యాంకు

By

Published : Aug 30, 2019, 7:07 PM IST

Updated : Aug 30, 2019, 7:42 PM IST

దాదాపు వందేళ్లుగా తెలుగులోగిళ్లలో భాగమైన ఆంధ్రాబ్యాంక్ కనుమరుగు కానుంది. దశాబ్దాలుగా ఖాతాదారులకు సేవలు అందిస్తూ... వస్తున్న ఈ బ్యాంకు ఇక చరిత్రలో భాగం కానుంది. బ్యాంకుల విలీనంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఐదు ట్రిలియన్‌ డాలర్లకు దేశ ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లడమే లక్ష్యంగా... ప్రస్తుతమున్న 27 బ్యాంకులను విలీనం చేసి 12 బ్యాంకుల ద్వారా సేవలందించనున్నారు. విలీనం తర్వాత ఆంధ్రాబ్యాంక్​, కార్పొరేషన్‌ బ్యాంక్​, యూబీఐ... ఒకే బ్యాంక్​గా ఏర్పడనుంది. కొత్త విలీనంతో బ్యాంక్​ బిజినెస్ విలువ 14.6 లక్షల కోట్లకు పెరగనుంది.

దేశంలోని ప్రముఖ వాణిజ్య బ్యాంకుల్లో ఒకటైన ఆంధ్రాబ్యాంక్​ దాదాపు వందేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్​లో ఏర్పాటైంది. 1923, నవంబరు 20న స్వాతంత్య్ర సమర యోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్థాపించారు. 1980లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ బ్యాంక్​ను జాతీయం చేశారు. 1981లోనే క్రెడిట్ కార్డులను జారీ చేసి.. దేశానికి ఈ వ్యవస్థను పరిచయం చేసిన బ్యాంకుగా ఆంధ్రాబ్యాంక్​ నిలిచింది. 2003 నాటికి 100శాతం కంప్యూటరీకరణ సాధించిన ఘనత ఆంధ్రాబ్యాంక్​ది.

2007లో బయోమెట్రిక్ ఏటిఎంలను దేశానికి పరిచయం చేసిన ఆంధ్రాబ్యాంక్​... అదే ఏడాది సెప్టెంబర్ నాటికి... 1,289 బ్రాంచీలు, 99 ఎక్స్‌టెన్షన్ శాఖలు, 37 శాటిలైట్ కార్యాలయాలు, 505 ఏటిఎంలతో... 22 రాష్ట్రాలు, 2కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించింది. పెట్టుబడులను రాబట్టడంలోనూ ఆంధ్రాబ్యాంకు ఆసియాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం రుణాల్లో కనీసం 50 శాతానికి తగ్గకుండా... గ్రామీణ ప్రాంతాలకు అందించిన ఘనత ఆంధ్రాబ్యాంక్​ది.

ఇదీ చదవండీ... 'రాజధానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'

Last Updated : Aug 30, 2019, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details