పెడన నియోజకవర్గంలోని సెయింట్ విన్సెంట్ పాల్లోటి స్కూల్‌లో నిర్వహించిన అమ్మఒడి రెండో విడతను ఎమ్మెల్యే జోగి రమేశ్ ప్రారంభించారు. బాలలను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని స్పష్టంచేశారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకడానికి ప్రవేశపెట్టిన పథకంగా కొనియాడారు.
పేదరికం కారణంగా ఏ తల్లి.. తన బిడ్డలను బడికి పంపలేని పరిస్థితి రాకూడదని రెండో ఏడాది అమ్మఒడి ద్వారా చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 22,615 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విజయవాడ:
విజయవాడ వన్‌టౌన్ గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో అమ్మఒడి రెండో విడత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు పాల్గొని.. చెక్కులు పంపిణీ చేశారు. సంక్రాంతి పర్వదినం, అమ్మ ఒడి రెండో విడత డబ్బుల పంపిణీతో రాష్ట్రంలో సందడి నెలకొందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా జగనన్న దృఢ సంకల్పం ముందు అవన్నీ దిగదుడుపేనని మంత్రి పేర్కొన్నారు.