వైకాపా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే 2014 పునర్విభజన చట్టం సవరణ తప్పనిసరని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పారు. విభజన చట్టంలో రాజధాని ఏర్పాటు చేసుకోవాలని మాత్రమే ఉందని... రాజధానులు ఏర్పాటు చేసుకోమని ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపే పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకునే ముందు విభజన చట్టంలోని అంశాలను పరిగణంలోకి తీసుకోవాలని యనమల సూచించారు.
ఏదైనా బిల్లు రెండు సార్లు శాసనసభలో ఆమోదం పొంది శాసన మండలిలో తిరస్కరణకు గురైతే ప్రభుత్వం తనకున్న విచక్షణాధికారంతో దాన్ని ఆమోదింప జేసుకోవచ్చు. కానీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు శాసన మండలికి ఒక్కసారే వచ్చి సెలక్ట్ కమిటీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వీటిపై ప్రజాభిప్రాయం తీసుకోవటానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది. రాజధాని ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం. కేంద్రం రూపొందించిన విభజన చట్టం ప్రకారం... శివరామకృష్ణ కమిటీ నివేదికలను పరిగణలోకి తీసుకొని మేము అమరావతిని రాజధానిగా నిర్ణయించాం- యనమల రామకృష్ణుడు, మండలి ప్రతిపక్ష నేత