పేద పిల్లలకు సాయంత్రం పూట పాఠ్యాంశాలు బోధించేందుకు... 2017లో అమరావతి బాలోత్సవం కేంద్రాలను ప్రారంభించారు. అప్పట్లో 9 కేంద్రాలు ప్రారంభం కాగా... ప్రస్తుతం వీటి సంఖ్య 28కి చేరింది. 800 మంది విద్యార్థులు ఈ కేంద్రాల్లో చదువుకుంటున్నారు. ఏబీసీ విజ్ఞాన కేంద్రాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బయట ట్యూషన్లలో వేలకువేలు ఫీజులు కట్టినా... ఒకటి రెండు సబ్జెక్టుల కంటే ఎక్కువ నేర్పరు. అలాంటిది కేవలం రూ.50కే అన్ని సబ్జెక్టులు చెప్పడం బాగుందంటున్నారు.
ఏం నేర్పిస్తారు..?
ప్రతి కేంద్రంలో 30 మంది పిల్లలు మాత్రమే ఉంటారు. చదువుతోపాటు క్రమశిక్షణ, సమాజం పట్ల అవగాహన, పెద్దల పట్ల గౌరవంగా వ్యవహరించటం, విలువలు నేర్పిస్తున్నారు. కేవలం చదువే కాకుండారోజూ ఓ గంటపాటు బొమ్మలు గీయటం, కథలు రాయటం, నృత్యంపై తర్ఫీదు ఇస్తారు. ర్యాంకులే పరమావధిగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ముందుకెళ్తున్న నేపథ్యంలో... విద్యార్థులకు సమాజం గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి తెలియాలన్న ఉద్దేశంతో... బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.