KIDNEY TRANPLANT RACKET : ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణానికి చెందిన ఓ యువకుడి మూత్రపిండాన్ని శస్త్ర చికిత్స ద్వారా ఇతరులకు మార్చడం వివాదాస్పదంగా మారింది. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సకు ఏపీ అవయవ దాన ట్రస్ట్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ట్రస్ట్ నిబంధనలు పాటించకుండా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు ఆలస్యంగా బయటపడింది. సేకరించిన వివరాల మేరకు.. కొండపల్లిలోని చైతన్య నగర్‌కు చెందిన వెంకట నాగేశ్వరరావు రోజువారీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. ఆయనకు భార్య, పిల్లలున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం అప్పులపాలయ్యారు. ఎలా తీర్చాలని మదనపడుతున్న సమయంలో మూత్రపిండం అమ్మితే డబ్బులు వస్తాయని కొందరు దళారీల ద్వారా తెలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో గత సంవత్సరం సెప్టెంబరులో విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడితో వెంకట నాగేశ్వరరావుకు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఆసుపత్రి వైద్యుడు, దళారీలు కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు రూపాయలు ఇస్తామన్నారు. దానికి ఆయన అంగీకరించారు. అనంతరం వైద్యులు శస్త్ర చికిత్స చేసి మూత్రపిండాన్ని ఇతరులకు అమర్చారు. తర్వాత నాగేశ్వరరావుకు చెప్పిన మొత్తం ఇవ్వలేదు. నాలుగు నెలలు గడిచిన తర్వాత బాధితుడు తనకు అన్యాయం జరిగిందని గ్రహించి విషయాన్ని బయటకు చెప్పారు. ఇది ఆసుపత్రి వర్గాలకు తెలిసి నాగేశ్వరరావును పిలిపించి కొంత డబ్బు ముట్టజెప్పాయి.