అమరావతి రాజధాని నిర్మాణం పెద్ద స్కామ్, అక్కడ ఉండే రైతులు ఎవరూ ఉద్యమం చేయటం లేదు, అసలు అక్కడ ఉద్యమమే లేదని, కొంతమంది ధనవంతులు చేస్తున్న ఆర్భాటమని ఆరోపించిన అంబటి రాంబాబు తక్షణకే రైతులకు క్షమాపణ చెప్పాలని ఏఐసిసి సభ్యులు, విజయవాడ నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు డిమాండ్ చేశారు.
రాజధాని కోసం 85 మంది రైతులు చనిపోతే అది వారికి కట్టుకథలాగా కనిపిస్తుందా అని విమర్శించారు. రైతు శ్రామిక పార్టీ పేరు పెట్టుకున్న వైకాపా రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. వైకాపా ప్రజల కోసం పని చేయాలే గానీ ముఖ్యమంత్రి మెప్పు కోసం కాదని హితవు పలికారు.
అమరావతి కోసం ప్రాణాలర్పించిన రైతుల మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించిందా.. రైతుల మరణాలు ఆపటానికి నివారణ చర్యలు చేపట్టిందా అని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములిచ్చిన ఇంతమంది రైతులు, పేదలు, ఎస్సీలు వైకాపాకు అసలు మనుషులు లాగా కనపడటం లేదా అని మండిపడ్డారు.