కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలంలోని దాదాపు 15 తండాల్లోని ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 2 నెలల్లోనే కిడ్నీ సంబంధిత వ్యాధులతో 11మంది చనిపోయారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన కనీస సాయం కూడా అందకపోవడం, తాగునీటి కలుషితం, సరైన పౌష్టికాహారం లేకపోవడంతో కిడ్నీ బాధితుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. మూడేళ్ల క్రితం 15 వందల మంది కిడ్నీ బాధితులు ఉన్నట్టు గుర్తించారు. తాజాగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల బృందం బాధిత ప్రాంతాల్లో పర్యటించి సమస్యలపై అధ్యయనం చేసింది. బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
ఉపశమన మందులతో నెట్టుకొస్తున్న స్థానికులు..
కొవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా స్క్రీనింగ్ పరీక్షలను అధికారులు పూర్తిగా నిలిపేశారు. అంతకుముందు కూడా ఏడాది పాటు పరీక్షలు పెద్దగా నిర్వహించలేదు. దీంతో బాధితుల సంఖ్య ఎంత పెరిగిందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ వద్ద సరైన సమాచారం లేదు. తాత్కాలికంగా స్థానిక వైద్యుల సూచన మేరకు నొప్పి మాత్రలు, ఉపశమన మందులను వాడుతూ నెట్టుకొస్తున్నారు.
అడిగినా పట్టించుకోవట్లేదు..
కిడ్నీ వ్యాధులతో చనిపోయిన వారికి గత ప్రభుత్వ హయాంలో ఖర్చుల కోసం రూ. 10 వేల ఇచ్చేవారు. రెండేళ్లుగా ఆ డబ్బులను ఇవ్వడం ఆపేశారు. అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదంటూ బాధితులు వాపోయారు. డయాలసిస్ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.10 వేల పింఛను ఇస్తున్నారు. అలాగే.. కిడ్నీ సంబంధ వ్యాధుల బారినపడి వైద్యం చేయించుకుంటున్న వారికి రూ. 5 వేల పింఛను ఇవ్వాలని చాలామంది కోరారు. మందులు కూడా కొనుక్కునేందుకు డబ్బులు లేక.. వ్యాధి తీవ్రమై డయాలసిస్ వరకు వెళ్తున్నారు.