రాజధాని మార్పు మంచిది కాదన్న న్యాయవాదులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చడం మంచిది కాదని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. రాజధాని, హైకోర్టు తరలింపు ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏడు జిల్లాల న్యాయవాదులు విజయవాడలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో బార్ ఫెడరేషన్ అధ్యక్షులు, బార్ కౌన్సిల్ సభ్యులు, ఇతర న్యాయవాదులు సమావేశమయ్యారు. అమరావతిలోనే రాజధాని, హైకోర్టు ఉంచాలని సమావేశంలో తీర్మానించారు. ఈనెల 27వ తేదీ మంత్రివర్గ సమావేశం వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఇదీ కార్యాచరణ
ఈనెల 23న నిరసన ర్యాలీలు, 24న ఛలో హైకోర్టు, 26న ప్రకాశం బ్యారేజీ వద్ద రాజధాని రైతులు, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులతో ముట్టడి జరుగుతాయని బార్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. 27న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొనే మంత్రుల వద్దకు వెళ్లి తమ డిమాండ్‌ను తెలియజేస్తామని.. దీనిని అడ్డుకుంటే కేబినెట్ సమావేశ ముట్టడికి వెనుకాడబోమని న్యాయవాదులు తెలిపారు. రైతుల త్యాగాలను ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. జీఎన్‌రావు కమిటీ నివేదిక నమ్మశక్యంగా లేదని.. పోలీసులు రైతులపై నమోదు చేసిన కేసులను తాము ఉచితంగా వాదించి... వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:
రైతులకు మద్దతుగా.. రేపటినుంచి కృష్ణాజిల్లాలో ఆందోళనలు