ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే పట్టించుకోకపోవటంతో ఓ మాతృమూర్తి కన్నబిడ్డను చంపుకునేందుకు సిద్ధమైంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యుల చర్యలతో విసిగిపోయిన ఆమె... కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. కోర్టు ఉత్తర్వులు తెచ్చినా.. తన కూతురికి చికిత్స అందించేందుకువైద్యురాలు నిరాకరిస్తోందని ఆవేదన వెళ్లగక్కుతోంది.
బిడ్డ కారుణ్య మరణానికి అనుమతివ్వండి..ఓ తల్లి ఆవేదన - daughter
అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్యం అందకపోవటంతో ఆవేదనకు గురైంది ఆ తల్లి. కడుపున పుట్టిన బిడ్డ పరిస్థితి చూడలేక కారుణ్య మరణం కోరుతూ గవర్నర్‌కు విన్నవించింది. వైద్యం అందిస్తారా లేక కారుణ్య మరణానికి అనుమతిస్తారా అంటూ తన గోడును వెళ్లగక్కింది.
స్థానిక సింగ్‌నగర్‌కు చెందిన స్వర్ణలత 2000 సంవత్సరంలో కుమార్తెకు జన్మనిచ్చింది. సంతోషంగా సాగుతున్న వారి జీవితాన్ని విధి వెక్కిరించింది. ఆమె కుమార్తె జాహ్నవికి 4వ ఏట అరుదైన మానసిక వ్యాధి సోకి.. ఎనిమిదేళ్ల వయస్సులో గైనిక్పరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అప్పటినుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్ విభాగంలో ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. అయితే కొంతకాలంగా జాహ్నవికి వైద్యం చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు నిరాకరిస్తోందని స్వర్ణలత ఆరోపిస్తున్నారు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చినా వైద్యులు కనీస మానవత్వం మరిచారని ఆమె తెలిపారు. తన బిడ్డ పరిస్థితి చూసి తట్టుకోలేక.. కారుణ్య మరణం(మెర్సీ కిల్లింగ్)కి అనుమతి కోరుతూ గవర్నర్‌ను ఆశ్రయించినట్లు స్వర్ణలత ఆవేదన వ్యక్తం చేశారు.జాహ్నవి తండ్రివిజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చిరుద్యోగి కావడం విశేషం.