Vijayawada woman trader suicide case : 'నేను ఎవరినీ మోసం చేయాలన్న ఆలోచనతో ఈ వ్యాపారం ప్రారంభించలేదు.. నాకు చిన్న చిన్న మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.. వాళ్లతో ఆడుకోవాలని అనుకున్నాను.. కానీ, అలా జరగ లేదు.. నేను నమ్మిన వాళ్లు నన్ను మోసం చేశారు.. నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్లు ఇవ్వలేదు. కొంత మంది పారిపోయారు... కొంత మంది చనిపోయారు.. కొంత మంది ఉండి కూడా కట్టడం లేదు. నేను మాత్రం అందరికీ వడ్డీలు కట్టేశాను. నన్ను క్షమించండి.. నా దగ్గర ఎటువంటి ఆస్తి లేదు.. బంగారం కూడా లేదు.' అని తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించింది.. విజయవాడ భవానీపురం ప్రాంతంలో గోల్డ్ స్కీమ్ నష్టాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన తుపాకుల దుర్గాదేవి. వాస్తవాలను వెల్లడించేందుకు విజయవాడ కమిషనర్‌ను ఉద్దేశించి ఆమె సెల్ఫీ తీసుకున్నట్లు తెలుస్తోంది.
Vijayawada suicides : 'నమ్మినోళ్లే మోసం చేశారు.. అందుకే ఆత్మహత్య.. ' కంటతడిపెట్టిస్తున్నసెల్పీ వీడియో
Vijayawada woman trader suicide case : వారంతా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు. రూపాయి, రూపాయి కూడబెట్టుకుని పొదుపు చేసుకున్న డబ్బంతా అధిక వడ్డీకి ఆశపడి అప్పజెప్పారు. కానీ, డబ్బు తీసుకున్న వారు వ్యాపారం కొనసాగించలేక చేతులెత్తేశారు. ఆశించిన ఫలితం రాక నష్టాల్లో కూరుకుపోయారు. తిరిగి చెల్లించలేక ఆత్మహత్యే శరణ్యమని భావించారు. ఈ నేపథ్యంలో మృతురాలు ఆత్మహత్యకు ముందుకు మాట్లాడిన సెల్పీ వీడియో.. ప్రతి ఒక్కరని కంటతడిపెట్టిస్తోంది.
మేం కూడా మోసపోయాం... మమ్మల్ని క్షమించండి.. 'కేవలం సమాజానికి భయపడి చనిపోవాలనుకుంటున్నాం.. జనంతో గెలవలేక ఓడిపోతున్నాం.. నన్ను క్షమించండి.. నా దగ్గర ఉన్నంత వరకు ఒక్కొక్క రూపాయి కూడా ఇచ్చి పోరాటం చేశాను. ఒక్క రూపాయి కూడా నా దగ్గర ఉంచుకోలేదు. మా బంధువులు, స్నేహితులు మమ్మల్ని మోసం చేశారు. ఆర్ధికంగా నష్టపోయాం.. ఇంటి కాయితాలు తీసుకున్నారు. డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వలేదు' అని.. సెల్ఫీ వీడియోలో కన్నీరు మున్నీరైంది. 'పెద్ద చీటీలు వేస్తే.. ఎవరూ ఎత్తలేదు. కానీ, మేమే తీసుకుని ఇద్దామనుకున్నాం కానీ, ఇవ్వలేక పోయాను. మా ఫ్రెండ్ ఒకావిడ ఆమె కూతురు స్కూల్ ఫీజు కోసం ఎంతో సాయం చేశాను.. కానీ, ఆమె ఇపుడు చాలా మాటలు అనడాన్ని నేను భరించలేకపోతున్నాను. నేను నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు.' అని దుర్గాదేవి తెలిపింది. బంగారు ఆభరణాలు, అధిక వడ్డీ స్కీములు పెట్టి పేద మధ్య తరగతి ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన దుర్గాదేవితో పాటు వ్యాపార భాగస్వామి ఆత్మహత్యకు పాల్పడడం విదితమే. తుపాకుల దుర్గాదేవి ఆత్మహత్య కు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది.
భారీగా వసూళ్లు.. తిరిగి చెల్లించలేక..వీరిద్దరూ సుమారు రూ.2 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. నెల వారీగా కొంత చెల్లిస్తే బంగారు ఆభరణాలు ఇస్తామంటూ నమ్మబలికారని, మహిళల నుంచి డబ్బులు వసూలుచేసి గోల్డ్ స్కీంలో సభ్యులుగా చేర్పించారని తెలిపారు. విడతల వారీగా గోల్డ్ స్కీమ్‌లో, చీటీల పేరుతో రూ. కోట్ల వసూలు చేసినట్లు ఆరోపిస్తుండగా.. వ్యాపార భాగస్వామి తారకరామారావు అనారోగ్యానికి గురికావడం నష్టాలకు బీజం వేసినట్లు తెలుస్తోంది. వ్యాపారం దెబ్బతిని, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఖాతాదారులకు తిరిగి చెల్లించడం భారమైంది. తిరిగి తీర్చే దారులన్నీ మూసుకుపోవటంతో భవానీపురంలోని దుర్గాదేవి నివాసంలో ఇద్దరూ కలిసి శనివారం సాయంత్రం పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని బంధువులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. విషయం తెలుకున్న స్థానికులు ఇళ్ల వద్దకు భారీగా చేరుకుని లబోదిబోమన్నారు. ఈ క్రమంలో దుర్గాదేవి సెల్ఫీ బయటకు రాగా, భవానీపురం పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.