Round table meeting : దళితుల ప్రాణాలకు రాష్ట్రంలో విలువలేదు.. వారి ఫిర్యాదులంటే పోలీసులకు లెక్కేలేదని దళిత సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. పొరుగు రాష్ట్రంలో యువతిని అత్యాచారం చేశారని దిశ చట్టం తెచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం... రాష్ట్రంలోనే దళిత, మైనార్టీ యువతులపై అత్యాచారం, హత్య జరిగినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళిత, మైనార్టీలపై దాడులు ఆపకపోతే భవిష్యత్ లో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దళిత, మైనార్టీలపై దాడులను నిరసిస్తూ విజయవాడ దాసరి భవన్లో సీపీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతలు పాల్గొని మాట్లాడారు.
దళిత యువకుడ్ని చంపి డోర్ డెలివరీ చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీకి స్వాగతం పలికి సన్మానాలు చేస్తారా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళిత, మైనార్టీ యువతులపై అత్యాచారాలు జరుగుతున్నా సీఎం జగన్ మాట్లాడటం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. అణగారిన వర్గాలపై ఆయనకు ఉన్న ప్రేమ ఇదేనా..? అని ప్రశ్నించారు. యువతులపై అత్యాచారం చేసిన నిందితులకు శిక్షలు పడట్లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా..! అన్న సందేహం వస్తుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారని సీపీఎం నేత మధు ఆరోపించారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారని, ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో వెనుకబడిన వర్గాలకు రక్షణ కరువైందని, దళితులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని సీఎంకు లేఖ రాసి ఆరునెలలు గడుస్తున్నా స్పందన లేదని మధు తెలిపారు. అంబేద్కర్ ఎప్పుడూ తనకు 125 అడుగుల విగ్రహం పెట్టాలని కోరుకోలేదని.. దళితుల అభివృద్ధి కోరుకున్నారని మధు తెలిపారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ హోదాకు తగ్గట్లు వ్యవహరించట్లేదని ఆరోపించారు. పోలీసుల అండతో రాష్ట్రంలో దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని.. ఇలాగే కొనసాగితే ఛలో డీజీపీ కార్యాలయం చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టైనా లేదు. ఆయన సొంత జిల్లాలో జిల్లా స్థాయి అధికారి హత్య, దాడులపై స్పందించకపోవడం శోచనీయం. ప్రతిపక్షాలు, దళిత, మైనార్టీ సంఘాలను కలుపుకొని ఈ నెల 11వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తాం. - రామకృష్ణ ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
గ్రామాల్లో కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు పెత్తనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులపై దాడులను ప్రోత్సహిస్తున్నది. దాడులపై అఖిలపక్షాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. - మధు, సీపీఎం జాతీయ కమిటీ సభ్యుడు
ప్రజాప్రతినిధులే దళితుల పైదాడులు, అత్యాచారాలు చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. హత్యలు, అత్యాచారాల కేసుల్లో దేశంలో ఏపీ నాలుగో స్థానంలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా పాలకులు పట్టించుకోవట్లేదన్నారు. హైకోర్టు జడ్జి నుంచి సామాన్యుల వరకు ఎవరినీ వదలటం లేదన్నారు. భవిష్యత్ తరాల కోసం అందరూ నడుం బిగించాలన్నారు.
పాలకుల్లో చిత్తశుద్ధి లేకుంటే ఎన్ని చట్టాలు తెచ్చినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. తన వాళ్లను కాపాడుకోవటం కోసం అమాయకులను బలి చేస్తున్నారని, డా.అచ్చెన్న హత్య నిందితులను ప్రభుత్వం కాపాడుతుందని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నించటమే అచ్చెన్న చేసిన తప్పా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో జరిగే అరాచకాలు అన్నీ సీఎం జగన్ కు తెలుసునని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడుతున్నారని మండిపడ్డారు. దళితులు, మైనార్టీల అభివృద్ధికి తమ పార్టీ ఎప్పుడు ముందుంటుందని.. వారి కోసం ఏ ఉద్యమం చేసినా అండగా ఉంటామని తెలిపారు.
దేశంలో, రాష్ట్ర రాజకీయాల్లో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయి. పథకం ప్రకారం జరుగుతున్న అత్యాచారాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. దాడులు, అత్యాచారాల్లో ఏపీ దేశంలో నాలుగోస్థానంలో ఉండడాన్ని గమనిస్తే.. ఐక్య పోరాటాలు అవశ్యమని అనిపిస్తోంది. పలు చోట్ల ఎమ్మెల్యేలే భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.- గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ అధ్యక్షుడు