భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలతో.. క్షణికావేశంలో ఓ వివాహిత తన పిల్లలతో సహా కాల్వలోకి దూకింది. ఈ ఘటనలో పిల్లలు తప్పించుకోగా, ఆ మహిళ మృత్యువాత పడింది. గురువారం ఉదయం విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన రాచమళ్ల స్వరూపరాణి (32), శ్రీనివాసరావులకు 14ఏళ్ల కిందట వివాహమైంది. వారికి అభిషేక్ (13), కీర్తన (12) సంతానం. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన స్వరూపరాణి పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని బుధవారం 10గంటలకు ఇంటి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ బస్టాండుకు చేరుకుంది. అక్కడి నుంచి దుర్గాఘాట్, ప్రకాశం బ్యారేజీ తదితర ప్రదేశాల్లో తిరిగి సాయంత్రానికి పిల్లలిద్దరితో విజయవాడ నగరపాలక సంస్థ సమీపంలోని బందరుకాలువ వద్దకు చేరుకుంది. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో పిల్లలిద్దరినీ బలవంతంగా కాలువలోకి లాక్కెళ్లి చేతులతో వారిని నీటిలోకి అదిమి తాను కూడా మునిగింది. కాల్వలో నీటిమట్టం 4 అడుగులకు మించకపోవడం, ప్రవాహ వేగం లేకపోవడంతో పిల్లలిద్దరూ తల్లి నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. స్వరూపరాణి మాత్రం నీటిలోనే మునిగి ప్రాణాలు విడిచారు. కుమార్తె కీర్తన పైకి వచ్చి సమీపంలోనికి వారికి విషయాన్ని వివరించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని వివాహిత మృతదేహాన్ని వెలికితీశారు.
ఒకరి ఆచూకీ మరొకరికి తెలియక తల్లడిల్లిన అన్నాచెల్లెళ్లు
ఒడ్డుకు చేరుకున్న కీర్తనకు తన అన్నయ్య అభిషేక్ తప్పించుకున్న విషయం తెలియకపోవడంతో ఏడుస్తూ తన తల్లితో పాటు అన్నయ్య నీటిలో మునిగిపోయినట్లుగా చెప్పడంతో స్థానికులు కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఆచూకీ లభ్యం కాలేదు. అయితే తల్లి నుంచి తప్పించుకున్న అభిషేక్ బస్‌స్టేషన్‌కు చేరుకుని రాజమహేంద్రవరం బస్సెక్కి తన పక్కన ఉన్న ప్రయాణికుడితో తన తల్లి, చెల్లెలు నీటిలో మునిగిపోయారని చెప్పి, సెల్‌ఫోన్ అడిగి, కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారి ద్వారా అభిషేక్ క్షేమంగా ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు విషయాన్ని కీర్తనకు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటన సంభవించిన కొద్ది గంటల వ్యవధి వరకూ ఒకరి ఆచూకీ మరొకరికి తెలియక అన్నాచెల్లెళ్లు తల్లడిల్లిపోయారు.