'నేనేం తప్పు చేశానో నాకు తెలియదు. నన్ను క్షమించండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తప్పా. వైకాపా నాయకుల నాటకాలు నమ్మి ప్రజలు గుడ్డిగా ఓట్లేశారు' - పరిటాలలో భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలివి.
ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తెలిసే.. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇటీవల ఉత్తరాది నుంచి వచ్చిన ఓ పగటి వేషగాడు ఇచ్చిన సూచన మేరకు తమపై అసత్య ప్రచార దాడిని వైకాపా నేతలు, ప్రభుత్వ పెద్దలు ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ అన్ని విధాలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. మరుగుదొడ్లపై పన్నులు వేస్తున్న గాలిరెడ్డి.. మనం పీల్చే గాలిపైనా పన్ను వేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో తెదేపా ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన భోగి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘సీఎం మామూలు వ్యక్తి కాదు. విచిత్రమైన వ్యక్తి.. అలాంటి వారిని ఎక్కడా చూసి ఉండం.. మోసం, దగా చేస్తూ సానుభూతి కోసం నాటకాలకు తెరతీస్తారు’ అని ఆరోపించారు. 18 నెలల్లో ఏడుసార్లు తుపాన్లు వస్తే నష్ట పరిహారం చెల్లించని రైతు వ్యతిరేకి సీఎం జగన్ అని, బీమా పథకానికి స్వస్తి పలికారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే బీమా ప్రీమియం చెల్లించలేదని అసెంబ్లీలో నిలదీస్తే రాత్రికి రాత్రి జీవో ఇచ్చారని గుర్తు చేశారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడే మంత్రి, హవాలా, పేకాట, బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని.. మంత్రుల పేర్లు ఉచ్చరించడమూ తనకు ఇష్టం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అవినీతి మీటర్లు..
'వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు పెట్టి.. ఉచిత విద్యుత్తుకు తిలోదకాలు ఇవ్వడం కాదు.. మీ పార్టీ ఎమ్మెల్యేలకు మీటర్లు అమరిస్తే ఎంత మేరకు అవినీతి చేశారో తెలుస్తుంది’ అని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. టమాటా, అరటి ధరలు భారీగా తగ్గిపోయి రైతులు నష్టపోతుంటే ఈ ముఖ్యమంత్రి నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు టమాటా రైతుల వద్ద కొనుగోలు చేయించి ప్రజలకు తక్కువ ధరకు విక్రయించానని గుర్తు చేశారు. సుబాబుల్ టన్నుకు రూ.1,000కి కూడా కొనుగోలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మార్కెట్ యార్డుల ద్వారా సుబాబుల్ కొనుగోలు చేయించానన్నారు. 150 దేవాలయాలపై దాడులు జరిగితే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఆరోపించారు. హిందూ దేవాలయాలపై మరోసారి దాడి జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. కంచికచర్లకు చెందిన ఓ వైద్యుడిపై గంజాయి కేసు బనాయిస్తామని బెదిరించి రూ.5 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. దీనికి పోలీసులు సహకరించడం చిత్రంగా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికారులు, పోలీసులపై నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. ‘ఎన్నికల సంఘం ఒక్కటే ఎన్నికలు నిర్వహించదు.. అధికారులు, పోలీసులు అందరూ సమర్థంగా విధులు నిర్వహించినప్పుడే అక్రమాలకు తావుండదు. వైకాపా నాయకుల అక్రమాలు సాగవనే ఉద్దేశంతో ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెబుతున్నారు’ అని ధ్వజమెత్తారు.
మండిపడ్డ నేతలు
రాష్ట్ర రాజధాని కోసం చంద్రబాబు పిలుపు మేరకు 33వేల ఎకరాలు ఇచ్చి అమరావతి రైతులు త్యాగం చేశారని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజా ముఖ్యమంత్రి మన మధ్యలో బాబు రూపంలో ఉన్నారని, ఫేక్ ముఖ్యమంత్రి తాడేపల్లిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరాంతాతయ్య, నల్లగట్ల స్వామిదాసు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య పాల్గొన్నారు.