కృష్ణా జిల్లాలో 3వ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. యువతతో పాటుగా వృద్ధులు కూడా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు.
అవనిగడ్డ, మోపిదేవిలో
జిల్లాలోని అవనిగడ్డలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ద ప్రసాద్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చల్లపల్లిలో మాజీ శాసనసభ్యులు పాటూరు రామయ్య ఓటు వేశారు. మోపిదేవి మండలం నాగాయతిప్ప గ్రామంలో 90ఏళ్ల బొల్లిముంత కాంతమ్మ అనే వృద్ధురాలు.. తన ఓటు హక్కు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు.
కోసురువారిపాలెం, నాగాయలంకలో
కోసురువారిపాలెంలో ఉదయం 6 గంటల నుంచే ఎన్నికల సందడి నెలకొంది. నాగాయలంకలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పామర్రు నియోజకవర్గం మచిలీపట్నం డివిజన్లోని మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొవ్వ మండలంలోని అయ్యంకి గ్రామం పోలింగ్ కేంద్రాలను అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా పరిశీలించారు. పెదముత్తేవిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కూచిపూడిలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న వృద్ధులకు.. పోలీసులు సహాయం చేస్తున్నారు.
మచిలీపట్నంలో
మచిలీపట్నం డివిజన్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పెడన మండలంలోని 20 పంచాయితీల్లో పోలింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఉదయం 10గంటల వరకు 45శాతం పోలింగ్ నమోదైంది. ఘంటశాల మండల పరిధిలో అత్యధికంగా పోలింగ్ నమోదవుతుంది. గూడురు మండల పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో జిల్లా ఎస్పీ రవీంధ్రనాథ్ బాబు సందర్శించి.. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
ఇదీ చదవండి:ఆ స్థానాల్లో నోటిఫికేషన్ను రద్దు చేయాలి: సీపీఐ