108 అంబులెన్స్‌ల కొనుగోళ్లు, నిర్వహణలో 307 కోట్ల అవినీతి జరిగిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. అంతర్జాతీయంగా అంబులెన్స్ సేవల్లో అనుభవమున్న సంస్థను అర్ధాంతరంగా తప్పించి, రేట్లు పెంచి అనుభవం లేని విజయసాయిరెడ్డి అల్లుడి సంస్థకు వీటి నిర్వహణను ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. దీనిపై విజయసాయిరెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.
వైకాపా ప్రభుత్వం స్కాం కోసమే ఇళ్ల స్థలాల స్కీం పెట్టిందని చినరాజప్ప విమర్శించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసే ధైర్యం జగన్ ప్రభుత్వానికి ఉందా అని సవాలు విసిరారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి సరాసరి 26వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే... జగన్ ప్రభుత్వం 13 నెలల్లోనే 87వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మండిపడ్డారు. తమ చేతగాని తనాన్ని, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి బకాయిలపై వైకాపా నేతలు పదే పదే అబద్ధాలు చెబుతున్నారని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.