20th day Anganwadis Strike:20 రోజులైనా సడలని సంకల్పం. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ పట్టు విడవని పోరాటం. ప్రభుత్వం బెదిరించినా జీతాలు పెంచలేమని తెగేసి చెప్పినా వెక్కితగ్గని ఉద్యమం. పిల్లల సంరక్షణలో చూపించే ఓర్పును, సమస్యల సాధన కోసం కూర్పుగా చేసుకుని సమష్టిగా తిరుగుబాటు చేస్తున్న వైనం. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు రోజురోజుకూ ఆందోళనల్లో వేడి పెంచుతూ పోరు సాగిస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకలకూ దూరంగా ఉంటూ రోడ్డెక్కి వివిధ రూపాల్లో గొంతెత్తుతున్నారు.
కనీస వేతనం 26వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 20వ రోజు కొనసాగింది. విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తునిలో పాటలు పాడుతూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ప్రధాన రహదారిపై క్రికెట్ ఆడుతూ ఆందోళన చేశారు.
Anganwadi Strike in West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అడుదాం అంగన్వాడీ పేరుతో కబడీ ఆడి వినూత్నంగా నిరసన తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీల దీక్షకు పలు ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలియజేశారు.
జగనన్న'ఏసీలో నువ్వు ఉన్నావు' 'రోడ్డు మీద మేము ఉన్నాం': అంగన్వాడీలు
Anganwadi Kabaddi in YSR District: వైఎస్సాఆర్ జిల్లా మైదుకూరులో డిమాండ్లతో కూడిన నినాదాలు చేస్తూ అంగన్‌వాడీలు కబడ్డీ ఆడారు. సీఎం జగన్ మాస్క్ ధరించిన యువకుడు 'నేను విన్నాను, నేను ఉన్నాను' అంటూ కూతకు రాగా అంగన్‌వాడీలు పట్టుకునే దృశ్యాలతో కబడ్డీ ఆడారు. డిమాండ్లు నెరవేర్చాలంటూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 20వ రోజూ ఉద్ధృతంగా కొనసాగుతోంది. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, గ్రాట్యూటీ తదితర డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు. అంగన్వాడీలు వినూత్నంగా నిరసనలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీలు
Anganwadi Strike in Ongole Collectorate:ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ సిబ్బంది ధర్నా చేపట్టారు. అంగన్వాడి సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను ఇంత వరకు అమలు కాలేదని మండిపడ్డారు. అంగన్వాడీలు 20 రోజుల నుంచి సమ్మెబాట బడితే ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చేంతవరకు సమ్మె విరమించబోమని అంగన్వాడీలు ముక్తకంఠంతో చెప్పారు.
మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీలు - పలుచోట్ల ఉద్రిక్తత
Anganwadi Strike 20th Day in AP:20వ రోజు సమ్మెలో భాగంగా కడప ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు కబడ్డీ ఆడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మైదుకూరులో అంగన్వాడీలు ఆటపాటలతో నిరసన తెలిపారు. తమ డిమాండ్లతో కూడిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కబడ్డీ ఆడుతూ నినాదాలను వినిపించారు.
18వ రోజూ తగ్గని హోరు - వినూత్న నిరసనలతో ఆంగన్వాడీల అందోళన
Resolve The Demands in Anganwadi: ఇరవై రోజులుగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తుందని పలువురు కార్యకర్తలు మండిపడ్డారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని అంగన్వాడీలు హెచ్చరించారు.
Anganwadi Strike in All Districts: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సంఘాల పిలుపు మేరకు గత 20రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న ఆత్మకూరులోని అంగన్వాడి కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదు అనే అభిప్రాయం కలిగేలా దున్నపోతుకు వినతి పత్రం అందజేసి ఇప్పుడైనా తమ సమస్యను పరిష్కరించాలంటూ వినూత్న తరహాలో నిరసన తెలియపరిచారు. న్యాయమైన తమ సమస్యల పట్ల ప్రభుత్వం దున్నపోతుపై వర్షం పడినట్లుగా వ్యవహరిస్తున్నందుకు దున్నపోతుకు అర్జీ ఇచ్చే కార్యక్రమం చేపట్టినట్లు ఆత్మకూరు ప్రాజెక్టు కార్యదర్శి రాధా తెలిపారు. వీరి నిరసనకు మద్దతుగా సీఐటీయు నాయకులు డేవిడ్ రాజు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.