108 Ambulance: 108 అంబులెన్సు వాహనాల్లో కొన్నింటి కాల పరిమితి ముగిసింది. దీంతో చాలా సందర్భాల్లో క్షతగాత్రులను, ఇతర బాధితులను సకాలంలో ఆసుపత్రులకు చేర్చడంలో జాప్యం జరుగుతోంది. పాతవి పని చేయక పోవడంతో పాటు కొత్త అంబులెన్సుల కొనుగోలుకు నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా 146 అంబులెన్సులను ‘ఫోర్స్’ నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం టెండరు ఖరారు చేసినా... వాహనాలు యుద్ధప్రాతిపదికన సరఫరా అయ్యేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదు. మరో నెల రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ సంస్థ ఇప్పటికే 260 కొత్త 104 అంబులెన్సుల (ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్)ను నాలుగు నెలల కిందట ప్రభుత్వానికి అందజేసింది. ఈ మేరకు ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.35 కోట్ల కోసం ఆ సంస్థ ప్రతినిధులు వైద్యారోగ్య శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బకాయిల చెల్లింపు పూర్తయితే తప్ప.. 108 అంబులెన్సులు త్వరితగతిన అందుబాటులోనికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
తరచూ మరమ్మతులు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. తణుకు జిల్లా ఆసుపత్రిలో గంట వరకు సరైన చికిత్స అందలేదు. చివరికి మెరుగైన వైద్యం కోసం ఏలూరు మెడికల్ కళాశాలకు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. 108 కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేయగా ఆసుపత్రికి చేరిన అంబులెన్సు.. యువకుడిని తీసుకొని వెళ్తూ.. తేతలి దగ్గర టైర్ పంక్చర్ కారణంగా నిలిచిపోయింది. వారి కోసం మరో అంబులెన్సు 40 నిమిషాల తరువాత అక్కడకు చేరగా.. తిరిగి స్టార్ట్ చేసినప్పుడు ఇంజిన్ వేడెక్కి పొగ రావడంతో సిబ్బంది భయపడ్డారు. చివరకు పెరవలి నుంచి మూడో అంబులెన్సు వచ్చి యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఇలా రహదారిపైనే గంటల పాటు బాధితుడు, కుటుంబ సభ్యులు వేచి చూడాల్సి వచ్చింది.