ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమలాపురం ఘటనలో మరో 20 మంది అరెస్టు: జిల్లా ఎస్పీ - కోనసీమ ఘటనలో ఇద్దరు అరెస్టు

కోనసీమ అల్లర్ల ఘటనలో మరో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మెుత్తం అరెస్టైన వారి సంఖ్య 111కి చేరింది. జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొనటంతో కొన్ని మండలాల్లో అంతర్జాల సేవలు పునరుద్ధరించామని ఎస్పీ వెల్లడించారు.

అమలాపురం ఘటనలో మరో 20 మంది అరెస్టు
అమలాపురం ఘటనలో మరో 20 మంది అరెస్టు

By

Published : Jun 4, 2022, 10:26 PM IST

Amalapuram incident: కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్ల కేసులో మరో 20 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఇప్పటివరకు 111 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అంబాజీపేట, అయినవిల్లి, అమలాపురం, అల్లవరం మినహా మిగతా మండలాల్లో క్రమేపీ అంతర్జాల సేవలు పునరుద్ధరించామని తెలిపారు. పట్టణంలో పోలీసు బందోబస్తు కొనసాగుతుందని.., ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టింగులు పెడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ఏం జరిగిందంటే :కోనసీమ జిల్లా అమలాపురం గతనెల 24న ఆందోళనలతో అట్టుడికింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.

సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ABOUT THE AUTHOR

...view details