SIT interrogated lawyer Srinivas: తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా నిన్న, ఈరోజు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీకి అభిమానంతోనే విమానం టికెట్ బుక్ చేశానని, అంతకుమించి ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని శ్రీనివాస్ తెలిపారు. రెండోరోజు విచారణకు హాజరైన ఆయన్ను దాదాపు 7గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు.
విచారణ పూర్తయిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తనకు భాజపాతో ఎలాంటి సంబంధం లేదని, ఎమ్మెల్యేల ఎర కేసుతోనూ ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. గతంలో పూజలు చేయించుకున్న క్రమంలో సింహయాజీ స్వామీజీతో పరిచయం ఏర్పడిందని, ఆ అభిమానంతోనే టికెట్ బుక్ చేసినట్టు తెలిపారు. సిట్ అధికారుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.