Samagra Siksha Abhiyaan Employees Strike: రెగ్యులైజేషన్, వేతనాల పెంపు, తక్షణమే బకాయిల చెల్లింపు తదితర సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటంతో సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఈరోజు దీక్షకు దిగారు. అనకాపల్లి, ముమ్మిడివరం, నెల్లూరు, విజయనగరం, ఓంగోల్లో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ సమ్మె విరమించబోమని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు స్పష్టం చేశారు.
సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరిచి సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేసి, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. యం.టీ.యస్ అమలు చేసి వేతనాలు పెంచాలి. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెలా 1వ తేదీకి వేతనాలు చెల్లించి, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, గ్రాడ్యుటీ మరియు 20లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
"సమాన పనికి సమాన వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి. ఈ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా మాచేత వెట్టిచాకిరి చేయించుకుంటోంది. ఇందుకు నిరసనగా మేము సమ్మె చేస్తున్నాము. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి". -సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగి