Jana Sena chief Pawan Kalyan: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎల్ఐసి బైపాస్ రహదారి పనులకు మోక్షం లబించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో రోడ్డు మరమ్మత్తులకు సంబంధించి ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడంతో.. నేడు రహదారికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. గత కొంత కాలంగా... వివిధ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితులపై జనసేన నాయుకు, కార్యకర్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునే ఉన్నారు. తమ తమ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితులపై ఫోటోలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్లు చేయడం చూస్తునే ఉన్నాం. మరి కొన్ని ప్రదేశాల్లో స్వంయంగా శ్రమదానం చేస్తూ రహదారి మరమ్మతు పనులు చేపడుతున్నారు.
15 రోజుల అల్టిమేటం:జనసేన అధినేత పపన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ... అక్కడి స్థానిక సమస్యలపై ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి సమస్యలపై స్థానిక నేతలతో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ఆయా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా మలికిపురంలో పవన్ నిర్వహించిన బహిరంగ సభలో రాజోలు బైపాస్ రహదారిపై పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ప్రభుత్వం స్పందించి 15 రోజుల్లోగా రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్డు పనులు చేపట్టక పోతే జనసేన సైనికులతో కలిసి శ్రమదానం చేసి మరీ రోడ్డు పనులు పూర్తిచేస్తామని పవన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో స్పందనలు మెుదలయ్యాయి. ఎట్టకేలకు రాజోలు బైపాస్ రహదారి పనులకు మోక్షం లభించింది.