కోనసీమ జిల్లా అమలాపురం విధ్వంసం ఘటనలో ఇప్పటివరకు 91 మందిని అరెస్టు చేశారు. విధ్వంసానికి కారకులైన మరికొంత మందిని అరెస్టు చేసే దిశగా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మెుత్తం ఏడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మరో ఏడు బృందాలు ద్వారా అమలాపురంలో పికెట్లు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో పౌర జీవనం కొనసాగుతోంది. అమలాపురం పట్టణంతో సహా ఎనిమిది మండలాల్లో అంతర్జాల సేవలను ఇంకా పునరుద్ధరించలేదు.
ఏం జరిగిందంటే :కోనసీమ జిల్లా అమలాపురం గతనెల 24న ఆందోళనలతో అట్టుడికింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.