కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో.. మంగళవారం నాటి విధ్వంసం మూలాల శోధనలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఉద్యమం హింసాత్మకంగా మారడం వెనుక కుట్రకోణం ఉందనే వ్యాఖ్యలు రావడంతో ఆ దిశగానూ దర్యాప్తు ముమ్మరం చేశారు. తెదేపా, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు వైకాపా బీసీ కౌన్సిలర్‌తో మంతనాలు జరిపారని మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతవరకూ కోనసీమ సాధన సమితి ఆందోళనలోకి రౌడీషీటర్లు చొరబడ్డారని భావించిన పోలీసులకు.. మంత్రి వ్యాఖ్యల దిశగానూ దర్యాప్తు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. మంత్రి వ్యాఖ్యలతో అధికార పార్టీ నాయకుడూ... ఈ కుట్రలో ఉన్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది.
సీసీటీవీ ఫుటేజీ, మీడియా, సామాజిక మాధ్యమాల దృశ్యాల ఆధారంగా నిందితుల్నిగుర్తిస్తున్నారు. అమలాపురం సహా పరిసర గ్రామల నుంచి నుంచి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బుధవారం నాటికి అల్లర్లలో పాల్గొన్నవారిలో వెయ్యి మందిని గుర్తించారు. వీరిలో 46 మందిని కీలక వ్యక్తులుగా భావించి ఎఫ్.ఐ.ఆర్.లో పేర్లు చేర్చారు. వీరిలో దాదాపు అన్ని పార్టీలవారూ ఉన్నట్లు తెలుస్తోంది. అధికంగా వైకాపాకు చెందినవారే ఉన్నారు. మంత్రి విశ్వరూప్ అనుచరుడు, వివిధ కార్యక్రమాల్లో నిత్యం పాల్గొనే అన్యం సాయిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకారుల్లో 19 మందిని అరెస్ట్ చేసినట్టు ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు చెప్పారు. శుక్రవారం మరింత మందిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.