Police Arrest TDP Leaders in Mandapet:డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం సమీపంలో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాల పరిశీలనకు సిద్ధమైన తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం, అరెస్టులు చేశారు. కేశవరం వెళ్లకుండా మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావును, పార్టీ శ్రేణులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
TDP Call on Illegal Gravel Mining:కేశవరం సమీపంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాల ప్రదేశాలను పరిశీలించేందుకు.. టీడీపీ, జనసేన శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు నేడు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బుధవారం తెల్లవారుజాము నుంచే ఎమ్మెల్యే జోగేశ్వరరావుతో పాటు.. అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, కొత్తపేట మండలం వాడపాలెంలో మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు, తెలుగుదేశం మిత్రపక్షమైనన జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌లను సైతం గృహ నిర్బంధం చేసి, ఇంటి వద్ద ఆంక్షలు విధించారు.
సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ 'చలో పుట్టపర్తి'కి టీడీపీ పిలుపు-నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
TDP MLA Jogeswara Rao Comments: టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ..''మేము జగనన్న కాలనీలో గ్రావెల్ తరలింపుకు వ్యతిరేకం కాదు. కానీ, తోట త్రిమూర్తులు కలెక్టర్ ద్వారా అనుమతులు పొంది, గ్రావెల్ అక్రమంగా తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే కోట్ల రూపాయలు విలువైన 15 వేల లారీల మట్టి తరలించారు. అందుకే ఈరోజు కేశవరం సమీపంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాల ప్రదేశాలను పరిశీలించేందుకు మిత్రపక్షమైన టీడీపీ-జనసేన నేతృత్వంలో పిలుపునిచ్చాము. కేశవరం బయలుదేరడానికి సిద్దమైన మమ్మల్ని పోలీసులు అరెస్డ్, గృహనిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.'' అని ఆయన అన్నారు.