Godavari Flood: కొద్దిరోజులాగా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను నిద్రలేని రాత్రులు మిగిల్చిన గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో... గోదావరికి మరోసారి వరద ఉద్ధృతి పెరిగింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసినట్లు అధికారులు తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు.. ఇటీవలి వరదలకు అతలాకుతలమయ్యాయి. పలు గ్రామాల్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుటపడలేదు. ముమ్మిడివరం మండలంలోని 8 లంక గ్రామాలలో.. వేల ఎకరాల్లోని కొబ్బరి, అరటి, బత్తాయి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొబ్బరిలో అంతర పంటగా వేసిన బత్తాయి, నారింజ పూర్తిగా రంగు మారిపోయాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ వరద ఉద్ధృతి పెరగుతుండడంతో.. లంక గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం గోకవరపుడ గ్రామ ప్రజలు.. ముంపు పరిహారం అందించలేదని ఆందోళనకు దిగారు. వరద నష్టానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి పరిహారమూ ఇవ్వలేదని వాపోయారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన తమను.. పట్టించుకునే నాథుడే లేడంటూ గోదావరి నీటిలో దిగి నిరసన తెలిపారు. ఉప్పు, పప్పు, బియ్యం తమకు అవసరం లేదని.. పరిహారం అందిస్తే చాలని బాధితులు కోరుతున్నారు.