Pedapudi Bridge: కోనసీమ జిల్లాలోని గంటి పెదపూడి పంచాయతీ పరిధిలో గ్రామాలతో పాటు... చుట్టుపక్కల ఊళ్లను దశాబ్దాలుగా వరద కష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా.. గంటి పెదపూడి పంచాయతీ పరిధిలోని అరిగెలవారిపేట, జి.పెదపూడిలంక, బూరుగులంకతో పాటు.. ఉడిముడి పంచాయతీలోని ఉడిముడిలంక గ్రామాలు.. జులై, ఆగస్టు నెలల్లో జలదిగ్బంధమైపోతాయి. గోదావరి నది పాయ చుట్టూ ఉండే ఈ గ్రామాలకు... వరద మిగిల్చే కష్టాలు అన్నీఇన్నీకావు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి.. కనీస అవసరాలకూ నానా అవస్థలు పడుతుంటారు.
గోదావరి ఉగ్రరూపానికి.. జులైలో గోదావరి ఉగ్ర రూపానికి గంటిపెదపూడి పంచాయతీ పరిధిలోని గ్రామాలన్నీ అతలాకుతలమైపోయాయి. ఏ చిన్న అవసరమొచ్చినా ఇక్కడి ప్రజలు నావలపై ప్రమాదకర ప్రయాణాలు చేస్తూ బతుకీడుస్తున్నారు. గోదావరి పాయపై వంతెన నిర్మిస్తే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని.. ఏళ్లుగా పాలకులు, అధికారులను కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఎదురుచూస్తున్న ప్రజలు.. ఇటీవలి గోదావరి వరదల కారణంగా భారీ నష్టం సంభవించిన గంటి పెదపూడి పంచాయతీతో పాటు.. చుట్టుపక్క ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తమ సమస్యను ముఖ్యమంత్రికి విన్నవించుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తమకు వంతెన నిర్మిస్తే చాలని... ఇంకేమీ అక్కర్లేదని చెబుతున్నారు.