Pawan Kalyan Rally in Dindi: రాజ్యాంగం బలంగా ఉండాలని.. ప్రజాప్రతినిధి బాధ్యతగా, జవాబుదారీగా మెలగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదని.. పరివర్తన కోసమన్నాపు. అధికారం అంతిమ లక్ష్యం ప్రజల కన్నీళ్లు తుడవడమే అని.. అలా తుడవలేని ప్రభుత్వాలతో ప్రయోజనం ఏమిటని నిలదీశారు. నాయకులు ఎవరైనా.. వాళ్లు మన కోసం పనిచేస్తున్నారా లేదా చూడండని.. మనోడని కాదు.. మనవాడు సరైనోడో కాదో చూడండి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
వారాహి విజయ యాత్రలో భాగంగా డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. తాను రాజకీయాల్లోకి వచ్చి 14 సంవత్సరాలు అవుతోందని.. అరణ్యవాసం ముగించుకుని బయటకు వచ్చానని వ్యాఖ్యానించారు. మనం చేసేది మార్పు కోసం యుద్ధమన్నారు. అన్ని కులాలు కొట్టుకోకుండా ఐక్యతతో ముందుకు వెళ్లడమే వచ్చే ఎన్నికల ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కోనసీమలో ఉన్న కోపం, ఆవేదన ఈ సమాజానికి అవసరమన్నారు. కోపం వచ్చినప్పుడు మనలో మనం కొట్టుకోకుండా.. మనల్ని ఎవరు దోపిడీ చేస్తున్నారో వారిపై చూపించగలిగితే మన జీవితంలో మార్పులు వస్తాయని చెప్పారు.
నాయకులు.. జాతుల్ని, మనుషుల్ని, కులాల్ని కలపాలే గానీ.. వారి మధ్య విద్వేషాలు పెట్టకూడదని హితవు పలికారు. కూలదోసేవాడు ఉంటే పడగొట్టేవాడు ఉంటాడని.. విడగొట్టేవాడు ఉంటే కలిపేవాడు ఉంటాడని.. దౌర్జన్యం చేసేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు ఉంటాడని పవన్ అన్నారు. ఎంత పెద్ద వస్తాదులు, తోపులైనా.. ప్రజాస్వామ్యాన్ని ఇబ్బందిపెట్టే ఎవరైనా సరే వారితో గొడవ పెట్టుకోవడానికి.. సంపూర్ణంగా దహించుకుపోవడానికి సిద్ధపడే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు పునరుద్ఘాటించారు.
తప్పు చేసిన వారిని వెనకేసుకురావద్దు:‘దళిత డ్రైవర్ని చంపిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కాపు. ఆయనది నా సామాజికవర్గమని నేను ఎలా వెనకేసుకొస్తాను? మనోడు తప్పు చేస్తే ముందు మనం నిలదీయాలి. ఓట్లు పోతాయని వెనకేసుకు రాకూడదు’ అని పవన్ అభిప్రాయపడ్డారు. తన అక్కను ఏడిపించాడని బాపట్ల జిల్లాలో గౌడ కులానికి చెందిన అమర్నాథ్ అనే బాలుడు ఎదురు తిరిగితే.. వెంకటేశ్వరరెడ్డి ఆ బాలుడ్ని పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. అది రెడ్డి కులం తప్పు కాదు. ఒక వ్యక్తి చేసిన తప్పును రెడ్డి, కాపు, కమ్మ, దళితులు, బీసీలు సహా ఏ సామాజికవర్గం వెనకేసుకురాదని పవన్ స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ తప్పు చేసినా నిలదీయండి: తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తప్పు చేసినా నిలదీసే హక్కు అందరికీ ఉంటుందని పవన్ అన్నారు. అంబేడ్కర్‌ను గౌరవించాలంటే రూల్ ఆఫ్ లా అందరూ పాటించాలన్నారు. హక్కులకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోకూడదన్నారు. సమావేశంలో జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు, సినీ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్, డీఎంఆర్ శేఖర్, కౌన్సిలర్లు, నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జనం నడుమ జనసేనాని: పార్టీ శ్రేణులతో సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రోడ్‌షో ప్రారంభించారు. అమలాపురం నుంచి మలికిపురం మండలం దిండి వరకు పవన్ రోడ్‌షో నిర్వహించారు. ఆయన వెంట పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివెళ్లారు. దారి పొడవునా మహిళలు, యువత, చిన్నారులు ఘన స్వాగతం పలికారు. దీంతో రోడ్లన్ని జనంతో కిటకిటలాడాయి. ప్రధాన కూడళ్ల వద్దకు యువత పెద్ద సంఖ్యలో చేరుకుని బాణసంచా కాల్చి సందడి చేశారు. జనసేన వీర మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. పోతవరం, అంబాజీపేట, ముంగండ, పి.గన్నవరంలో భారీ సంఖ్యలో జనం రావడంతో రోడ్లన్నీ కిక్కిరిశాయి.
పి.గన్నవరం వద్ద పవన్‌కల్యాణ్ ప్రజలను ఉత్సాహపరుస్తూ.. ‘అరాచకం ఆగాలి.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి’ ‘హలో ఏపీ.. బైబై వైసీపీ’ అని నినాదాలు చేయించారు. పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద భారీ ఇసుక డంప్ చూసి ఆగిన పవన్.. వివరాలు తెలుసుకున్నారు. రాజోలు మండలం తాటిపాక కూడలి వద్ద భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో అందరికీ పవన్ అభివాదం చేశారు. తాటిపాక నుంచి రాజోలు మీదుగా దిండి చేరుకున్న ఆయనకు అక్కడా ఘన స్వాగతం లభించింది. దిండిలో బస చేసిన పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం 10 గంటలకు పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గ నాయకులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు మలికిపురం కూడలిలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు.