Amalapuram: కోనసీమ జిల్లా అమలాపురంలో విధ్వంసంతో అప్రమత్తమైన పోలీసు శాఖ క్షేత్రస్థాయి పరిస్థితిపై నిశితంగా దృష్టిసారించింది. మే 24న సంఘటన అనంతరం క్షేత్రస్థాయి పరిస్థితి కుదుటపడినా ప్రత్యేక బలగాల మోహరింపు.. పోలీసు పికెట్లు కొనసాగుతున్నాయి. అమలాపురం పట్టణంలోని గడియార స్తంభంతోపాటు ప్రధాన మార్గాల్లో బందోబస్తు కొనసాగుతోంది. పేరూరు వై జంక్షన్, హైస్కూలు సెంటర్, ఈదరపల్లి, ఎర్ర, నల్ల వంతెన, బట్నవిల్లి ప్రాంతాల్లో పోలీసు పికెట్లు కొనసాగుతున్నాయి. అనుమానితులను తనిఖీచేసి.. వారి వివరాలు సేకరించాక పట్టణంలోకి అనుమతిస్తున్నారు.
పలు మండలాలకు అంతర్జాలం పునరుద్ధరణ:జిల్లాలో పది రోజులుగా నిలిచిన అంతర్జాల సేవలను విడతల వారీగా పునరుద్ధరిస్తున్నారు. ఎస్పీ సుబ్బారెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చాక.. కలెక్టర్ హిమాన్షు శుక్లాకు నివేదిస్తున్నారు. దీంతో హోం శాఖ అనుమతితో అంతర్జాల సేవలు పునరుద్ధరిస్తున్నారు. పి.గన్నవరం, రాజోలు, ఐ.పోలవరం, సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు, ఆత్రేయపురం మండలాల్లో అంతర్జాల సేవలు అందుబాటులోకి తెచ్చిన అధికారులు.. శుక్రవారం రాత్రి ఉప్పలగుప్తం, రావులపాలెం మండలాలకూ అంతర్జాల సేవలు అందించారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంతోపాటు.. అల్లవరం, కొత్తపేట, ముమ్మిడివరం, అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో సేవలపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.