రైతులు పంటవిరామం ప్రకటించడంతో అధికార యంత్రాంగం మేల్కొంది. ఖరీఫ్‌లో పంట వేయబోమంటూ కొందరు రైతులు తీర్మానాలు చేశారు. దీనిపై ‘ఈనాడు’లో ‘విరామమెరుగని వేదన’, ‘ధాన్యాగారంలో.. దైన్య స్థితి’ శీర్షికలతో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించారు. 2011లో మాదిరిగా పంటవిరామాన్ని ఉద్ధృతం చేసే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
బుధవారం కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, అమలాపురం అర్డీవో వసంతరాయుడు, డ్రెయిన్ల అధికారులతో కలసి అల్లవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో పర్యటించారు. ప్రధాన డ్రెయిన్లు, మురుగు కాలువలు, ప్రధాన పంట కాలువలు, ముంపునీరు సముద్రంలోకి దిగే సముద్ర మొగ ప్రాంతాలను పరిశీలించారు.
పంట విరామం ఆలోచన విరమించుకోవాలి: కలెక్టర్
కోనసీమలో కొన్ని మండలాల్లో రైతులు పంటవిరామం అంటున్నారని, ఆ అలోచన విరమించుకుని సాగు చేపట్టాలని కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. సాగుకు అవసరమైన వసతులన్నీ రైతులకు కల్పిస్తామన్నారు. ప్రభుత్వపరంగా అన్నివిధాలా సాయం చేస్తామని, వారం రోజుల్లో మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేయిస్తామని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పంట కాలువలకు సాగు నీరు విడుదల చేసినందున రైతులు ఖరీఫ్ పనులు ఆరంభించాలని కలెక్టర్ కోరారు.