NOTICES TO REPORTERS : వారంతా చిరుద్యోగులు. జిల్లా, మండల కేంద్రాల్లో వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో పనిచేసే స్థానిక విలేకర్లు. ప్రభుత్వం నుంచి వచ్చిన నోటీసు చూసి అవాక్కవుతున్నారు. ఐదేళ్ల కాలానికి పాత బకాయిలు సహా రూ.12,500 వృత్తిపన్ను కట్టాలన్నది ఆ నోటీసు సారాంశం. ఎన్నో ఏళ్లుగా విలేకర్లుగా పనిచేస్తున్నా... గతంలో ఎన్నడూ లేనిది, ఇప్పుడు ఈ బాదుడేంటో అర్థంకాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉన్నట్టుండి రూ.12,500 ఎక్కడి నుంచి తెచ్చేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వృత్తి పన్ను కట్టాలంటూ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న 28 మంది విలేకర్లకు ఈ నెల 17న నోటీసులు అందాయి. అమలాపురంలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ సర్కిల్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి. 2018-19 నుంచి 2022-23 వరకు ఏటా రూ.2,500 చొప్పున మొత్తం రూ.12,500 చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.