Robotic Fire Engines in Telangana : తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక విపత్తు నివారణశాఖ.. ఆధునిక పరికరాలను సమకూర్చుకోనుంది. నగరాలు, పట్టణాల్లో జరిగే ప్రమాదాల నివారణకు ప్రత్యేక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లోనూ మంటలు ఆర్పగలిగే రోబోటిక్ ఫైరింజన్లు, అత్యంత ఎత్తయిన భవనాల్లోనూ పోరాడగలిగే స్కైలిఫ్టుల వంటివి కొనుగోలు చేయనున్నారు. వీటికోసం రూ.100 కోట్లకు పైగా వెచ్చించనున్నారు. ఇందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో కొత్త పరికరాల నిమిత్తం అదనపు బడ్జెట్ కోరనున్నారు. దీంతో సంబంధం లేకుండా అదనపు నిధుల కోసమూ ప్రయత్నిస్తున్నారు.
దక్కన్‌మాల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం:ఇటీవల సికింద్రాబాద్‌లోని దక్కన్‌మాల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం పాలకులకు ముఖ్యంగా తెలంగాణ అగ్నిమాపక విపత్తు నివారణశాఖకు కొత్త పాఠాలు నేర్పింది. ఈ మాల్‌లో మంటలు ఆర్పడానికి రెండు రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గల్లంతవ్వగా.. అందులో ఒకరి ఎముకలు మాత్రమే దొరికాయి. మిగతా ఇద్దరు ఏమయ్యారో తెలియదు.
రూబీ హోటల్‌లో జరిగిన ప్రమాదం: వారి ఎముకలు కూడా బూడిదై ఉంటాయని భావిస్తున్నారు. దీన్నిబట్టి అగ్నిప్రమాదం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గత సెప్టెంబరులో సికింద్రాబాద్ రూబీ హోటల్‌లో జరిగిన ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మార్చిలో సికింద్రాబాద్ బోయిగూడలోని వ్యర్థ సామగ్రి(స్క్రాప్ గోదాము)లో జరిగిన ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. పెరుగుతున్న ప్రమాదాల తీవ్రతకు ఇవన్నీ నిదర్శనాలు.
అత్యాధునిక పరికరాలతోనే అదుపు:
- ఇప్పుడున్న అగ్నిమాపకశాఖ వద్ద ఉన్న సాధన సంపత్తితో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదాలను నివారించడం సాధ్యంకాదని, అత్యాధునిక పరికరాలు కావాల్సిందేనని అధికారులు భావిస్తున్నారు. ఇందులో ప్రధానమైంది రోబోటిక్ ఫైరింజిన్. మంటలు రేగుతున్న భవనంలోకి చొరబడటం సిబ్బందికి కూడా ప్రాణాంతకం. ఈ క్రమంలో అభివృద్ధి చెందిన దేశాల్లో రోబోటిక్ ఫైరింజిన్లు ఉపయోగిస్తున్నారు. నీళ్లపైపు దీనికి బిగిస్తారు. దీనికి ఉన్న కెమెరా ఎంత మంటనయినా తట్టుకోగలదు. రోబోట్‌ను, దానికి అనుసంధానంగా ఉన్న నీళ్లపైపును భవనం వెలుపల ఉన్న ఆపరేటర్ నియంత్రించగలుగుతారు. ప్రమాదానికి మూలమైన ప్రాంతంలో చెలరేగుతున్న మంటలను ఆర్పుతారు.
- ఎత్తయిన భవనాల్లో మంటలు ఆర్పేందుకు ఉపయోగించే స్కైలిఫ్టులు ప్రస్తుతం మూడు ఉన్నాయి. ఇవి 52 మీటర్ల ఎత్తువరకూ వెళ్లగలవు. కానీ అంతకుమించిన ఎత్తులో ఉన్న భవనాల్లో ప్రమాదాలు జరిగితే ఆర్పేందుకు మరో 4 స్కైలిఫ్టులు కొననున్నారు. వీటిలో మూడు 90 మీటర్లు, ఒకటి 100 మీటర్ల వరకూ ఎత్తు వెళ్లగలవు. ఇవి ఒక్కోటి రూ.30 కోట్ల వరకూ ఉంటాయని అంచనా.
- నగరాలు, పట్టణాల్లోని ఇరుకైన వీధుల్లోకి కూడా వెళ్లగలిగేలా ద్విచక్రవాహనాలకు అమర్చిన మిస్ట్ బుల్లెట్లు కూడా కొనుగోలు చేయనున్నారు. అగ్నిమాపక విపత్తు నివారణశాఖకు అధునిక హంగులు సమకూర్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆ శాఖ డీజీ నాగిరెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు.
ఇవీ చదవండి: