ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

GODAVARI FLOODS: 'గూడు చెదిరి.. గుండె బరువై'.. లంక వాసుల దీనగాథ - konaseema floods

GODAVARI FLOODS: సాధారణంగా లంక ప్రజలు వరదలను పెద్దగా లెక్కచేయరు. తరతరాలుగా గోదావరి గట్లని ఆనుకొనే నివాసాలు.. అక్కడే సాగు.. వాటికి అనుసంధానంగా పాడి పశువులు పెంచుతూ.. పట్టణ వాతావరణానికి కాస్త దూరంగానే ఉంటారు. ప్రతి ఏటా వచ్చే వరదే కదా అని ఇప్పుడూ అనుకున్నారు.. కానీ రోజురోజుకి లంక భూములను, గ్రామాలను ముంచెత్తుకుంటూ వస్తున్న వరదలను చూసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

GODAVARI FLOODS
GODAVARI FLOODS

By

Published : Jul 17, 2022, 3:46 PM IST

Updated : Jul 17, 2022, 4:11 PM IST

GODAVARI FLOODS: గోదావరి ఉద్ధృతి కారణంగా కోనసీమ జిల్లా రాజోలులో ఏటి గట్టుపై నుంచి వరద పొంగుతోంది. రాజోలులోని నున్నవారిబాడవ వద్ద.. గట్టుపై 3 అడుగులు ఎత్తు నీరు ప్రవహిస్తోంది. గట్టు వెంట ఉన్న 200 ఇళ్లు మునిగిపోయాయి. ఆయా నివాసాల ప్రజలు గట్టుపై గుడారాలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. రాజోలు, సోంపల్లి, శివకోటి గ్రామాల ప్రజలతో పాటు.. అధికారులు ఇసుక బస్తాలతో వరద అడ్డుకట్ట వేశారు

'గూడు చెదిరి.. గుండె బరువై'.. లంక వాసుల దీనగాథ

కోనసీమ జిల్లాలో ఏటిగట్లు ప్రమాదకరంగా మారాయి. రాజోలులో 6చోట్ల ఏటిగట్లు బలహీనంగా మారాయి. గట్టుపై నుంచి వరద పొంగి ప్రవాహిస్తుండడంతో అధికారులు, స్థానికులు రాత్రంతా గట్టుపైనే కాపలా కాస్తూ ఇసుక బస్తాలతో రక్షణ చర్యలు చేపట్టారు. ఉదయం వరద ఉద్ధృతి పెరగడంతో గట్టుపై రెండు అడుగులు ఎత్తు ఇసుక బస్తాలు వేశారు. రాజోలు వాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు లౌడ్ స్పీకర్లు ద్వారా ప్రచారం చేశారు. రాజోలు, సోంపల్లి, శివకోటి గ్రామాల యువకులు, ప్రజాప్రతినిధులు గట్టు రక్షణకు చర్యలు చేపట్టారు.

మహోగ్ర గోదావరి.. మూడు దశాబ్ధాల తర్వాత లంక గ్రామాల ప్రజల్ని బిక్కుబిక్కుమనేలా చేస్తోంది. ప్రతి ఏడాది వరదలానే భావించి అక్కడే ఉండిపోయిన లంకవాసులు ప్రస్తుత గోదావరి ఉద్ధృతికి తేరుకుని బయటికి రాలేక.. సర్వం కోల్పోయారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన, ఐ. పోలవరం, తాళ్లరేవు మండలాల్లోని లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇంటిలోని వస్తువులను వరద నీటి నుంచి కాపాడుకునేందుకు నానాఅవస్థలు పడుతున్నారు. పాడి పశువుల్ని ప్రాణాలతో దక్కించుకునేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గూడుచెదిన వారంతా గుడారాల్లోనూ.. కింది అంతస్తు మునిగిన వారంతా.. డాబాల మీదకు చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

గోదావరి వరద ముంపులో కోనసీమ లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. వరదల కారణంగా జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎల్‌.గన్నవరంలో ఇళ్లన్నీ మునిగిపోయాయి. డాబాలపైకి చేరిన జనం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. వరద నుంచి బయటపడే మార్గం లేక.. తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు పడవలు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాల్లో.. పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లోని లంక గ్రామాల్లో కూరగాయలు, అరటి, కంద పంటలు నాలుగు రోజులుగా నీటిలోనే నానుతున్నాయి. కూరగాయల పంటలు పూర్తిగా పాడైపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది. పి.గన్నవరం అక్విడెక్టులోకి వరద నీరు పోటెత్తోంది. వరద ఉద్ధృతికి గంటి నుంచి చాకలిపాలెం వరకు ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి మొత్తం జలమయం అయ్యింది. వరద నీరు పొంగిపోతుండడంతో.. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 51 లంక గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 17, 2022, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details