Pawan Kalyan met with farmer workers: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన 'వారాహి విజయ యాత్ర' గత ఏడు రోజులుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్.. రైతులు, మహిళలు, యువకులు, వివిధ రంగాలకు చెందిన కార్మికులతో సమావేశాలు నిర్వహిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అనంతరం జనసేనకు మద్దతిస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయే కార్యక్రమాలు చేయనున్నారో పవన్ కల్యాణ్ వారికి తెలియజేస్తున్నారు.
రైతు కూలీలతో పవన్ సమావేశం..ఈ క్రమంలో నేటి (8వ రోజు) పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ప్రముఖులు, కార్మిక, కర్షక, వ్యాపార వర్గాలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అన్నం పెట్టే రైతులకు, రాజకీయాలకు అతీతంగా జనసేన పార్టీ అండగా నిలుస్తుందన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారు అనాయాసంగా అన్నదాతల్ని దోచుకొని, అక్రమంగా సంపాదిస్తున్నారని మండిపడ్డారు.
''అన్నం తినే ప్రతి ఒక్కరికీ రైతు బాధ ఎలా ఉంటుందో తెలియాలి. జనసేన పార్టీ పాలన పగ్గాలు చేపట్టాక.. రైతులకు కావాల్సిన పెట్టుబడిని ప్రభుత్వం ద్వారా అందిస్తాం. రైతు సమస్యల పరిష్కారానికి నాతో కలిసి వస్తానంటే.. అన్ని పార్టీల్లో ఉన్న రైతు సంఘాలతో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనలో అనైక్యత వల్లే దళారులు దోచుకుంటున్నారు.''- పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధినేత
వీర మహిళలతో పవన్ భేటీ..ఆ తర్వాత వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్.. ముమ్మిడివరంలో వీర మహిళలతో సమావేశమయ్యారు. సమావేశంలో వీర మహిళలు పలు సమస్యలను పవన్ దృష్టికి తీసుకువచ్చారు. అందులో ముఖ్యంగా ఉచితాలు బదులు ఉపాధి కల్పించే మార్గాలు చూపిస్తే.. రాష్ట్రం అప్పుల పాలు కాదని మహిళలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఇంటర్, డిగ్రీ కళాశాల భవనాలు శిధిలావస్థకు చేరుకున్నాయని గుర్తు చేశారు. ఎప్పుడు ఆ భవనాలు కూలిపోతాయో తెలియక విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ.. చదువులను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చాక సమస్యలన్నీ తీర్చుతాం..మహిళలు.. డ్వాక్రా సంఘాల్లో దాచుకున్న పొదువు సొమ్ము గురించి అధికారులను ప్రశ్నిస్తే.. రకరకాల కారణాలు చెబుతున్నారని మహిళలు వాపోయారు. కనీసం పొదుపు సొమ్ము మీద లెక్కలు కూడా చూపడానికి క్షేత్రస్థాయిలో సరైన వ్యవస్థ లేదన్నారు. అమ్మఒడి డబ్బులు తల్లుల ఖాతాల్లో వేస్తే నాణ్యమైన చదువు రాదని.. నిపుణులైన ఉపాధ్యాయులను నియమిస్తే పిల్లలకు మంచి చదువు వస్తాయని పవన్ దృష్టికి మహిళలు తీసుకెళ్లారు. సమస్యల్ని సావధానంగా విన్న పవన్.. జనసేన ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వీర మహిళలకు హామీ ఇచ్చారు.