Cyber Crime: ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలతో కర్షకుని కష్టం ప్రకృతి ప్రకోపానికి గురై నష్టపోగా.. మిగిలిన గింజలను అమ్మగా.. వచ్చిన నగదును బ్యాంకు ఖాతాలో వేసుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన కొనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లిలో చోటు చేసుకుంది.
అంబేడ్కర్ కొనసీమజిల్లా రాజోలు మండలం చింతలపల్లికి చెందిన కౌలు రైతు శ్రీనివాస్ ఇటీవల ధాన్యం అమ్మగా వచ్చిన నగదు రూ.1,54,000 తన ఎస్బీఐ ఖాతాలో జమ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కౌలు రైతు శ్రీనివాస్ కుమార్తె శ్రీదుర్గకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీ నాన్న ఇన్సూరెన్స్ మీ పేరునా బదిలీ చేయాలి.. మీ హెల్త్ కార్డ్ నుండి మీ అకౌంట్కీ అమౌంట్ వస్తుందని నమ్మించి.. మీ నాన్న ఫోన్ నంబర్ చెప్పమని అడిగారు. దీంతో ఆమె ఫోన్ నంబర్ చెప్పడంతో శ్రీనివాసరావు ఎస్బీఐ ఖాతా నుంచి 1,02,000 కాజేశారు. కౌలుకు ఇచ్చిన యజమానులకు డబ్బులు ఇవ్వాలనుకున్న సమయంలో సైబర్ నేరగాళ్లు తన నగదు కాజేశారని.. అకాల వర్షాలతో పంటను కాపాడుకునే పనిలో ఉండగా తన కుమార్తె ద్వారా నగదు కాజేశారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కూలీలకు సరిపెడదామని ఉంచిన సొమ్ము లాగేయడంతో లబోదిబోమంటున్నాడు. రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జి. పృథ్వీ తెలిపారు.
వ్యవసాయ ధాన్యం అమ్మగా వచ్చిన నగదు రూ. 1,02,000 సైబర్ నేరగాళ్లు ఫోన్ పే ద్వారా దోచుకున్నారు. మా బిడ్డని మోసం చేసి ఆ డబ్బును కాజేశారు. ఎలాగైనా ఆ డబ్బును తిరిగి పొందే విధంగా చేయాలని పోలీసులని కోరుతున్నాం.- శ్రీనివాస్, కౌలు రైతు