కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో తన స్వగ్రామమైన గోపాలపురానికి చెందిన అమాయకులపై.. పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండుకు పంపడం దారుణమని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి పోలీసుస్టేషన్ వద్ద ఆదివారం నిరసన తెలిపారు. ఈ నెల 5వ తేదీ రాత్రి గోపాలపురంలో జాతీయ రహదారి పక్కన ఒక హోటల్లో పలువురు యువకులు నూడుల్స్, ఫ్రైడ్ రైస్ పార్సిల్ చేయించుకున్నారు. హోటల్ సిబ్బంది ఇచ్చిన ప్లేట్లపై అంబేడ్కర్ చిత్రాలు ఉండటంతో వారు నిర్వాహకుడిని అడిగారు. దీనిపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
హోటల్ నిర్వాహకుడు, ప్లేట్లు విక్రయించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా, హోటల్ యజమానిని నిలదీసేందుకు వెళ్లిన యువకులు, వాట్సప్‌లో రెచ్చగొట్టేలా సందేశాలు పంపిన 18 మంది దళిత యువకులపై కేసు నమోదుచేసి రిమాండుకు పంపించారు. అప్పటి నుంచి యువకులపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని ప్రతిపక్షాలు, దళిత నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్వగ్రామం కావడంతో ఆయనే వీరిపై కేసులు నమోదు చేయించారని ప్రచారం సాగింది. పార్టీ ప్లీనరీలో ఉన్న ఎమ్మెల్యే ఆదివారం మధ్యాహ్నం రావులపాలెం చేరుకుని వైకాపా కార్యాలయంవద్ద సమావేశం నిర్వహించి తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండించారు.