PROTEST: ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజుతో ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఆయన 20 గంటలుగా చేస్తున్న నిరసనను విరమించారు. ఘటనపై విచారణాధికారిగా కోనసీమ జిల్లా అదనపు ఎస్పీని నియమిస్తున్నట్లు డీఐజీ పాలరాజు తెలిపారు. కేసులో కుట్రకోణం ఉందా? లేదా? అనే విషయమై విచారణ జరపనున్నట్లు తెలిపారు. రావులపాలెం సీఐ, ఎస్‌ఐని స్టేషన్ విధుల నుంచి తొలగిస్తున్నామన్నారు.
అమాయకులైన దళితులపై పోలీసులు.. కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం పోలీస్స్టేషన్లో నిరసన చేపట్టారు. అమాయకులపై కేసులు నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం మధ్యాహ్నం పోలీస్స్టేషన్లో నిరసన చేపట్టారు. అమలాపురం ఎంపీ చింతా అనురాధ.. రావులపాలెం పోలీస్స్టేషన్ చేరుకుని జగ్గిరెడ్డికి మద్దతు తెలిపారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు జగ్గిరెడ్డితో చర్చలు జరుపుతున్నట్ల సమాచారం.
అసలేం జరిగిందంటే:ఈ నెల 5వ తేదీ రాత్రి కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలోని గోపాలపురంలో జాతీయ రహదారి పక్కన ఒక హోటల్లో పలువురు యువకులు నూడుల్స్, ఫ్రైడ్ రైస్ పార్సిల్ చేయించుకున్నారు. హోటల్ సిబ్బంది ఇచ్చిన ప్లేట్లపై అంబేడ్కర్ చిత్రాలు ఉండటంతో వారు నిర్వాహకుడిని అడిగారు. దీనిపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.