గోదావరికి వరద ఉద్ధృతి.. నీట మునిగిన లంక గ్రామాలు.. ప్రజల పాట్లు Godavari Floods: ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. విలీన మండలాల ప్రజలకు మరోసారి వరద కష్టాలు వచ్చిపడ్డాయి. దుగుట్టకు చెందిన వెంకమ్మ అనే మహిళ పశువులు మేపేందుకు వెళ్లి గోదావరి నీటిలో మునిగి ప్రాణం కోల్పోయింది. వి.ఆర్.పురం మండలంలో వందలాది ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన 5 వేల మంది నిర్వాసితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మారుమూల గ్రామాల ప్రజలు సమీప కొండలపైన టార్పాలిన్ పట్టాలతో గుడారాలు వేసుకుని ఉంటున్నారు. తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ఇబ్బందులు పడుతుంటే మళ్లీ వరద పెరుగుతుందన్న సమాచారంతో.. వి.ఆర్.పురం మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
జలదిగ్బంధంలో లంక గ్రామాలు: రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం వద్ద సముద్రంలోకి 13 లక్షల 57 వేల 790 క్యూసెక్కుల వరద నీటిని గురువారం ఉదయం 6 గంటలకు సముద్రంలోకి విడిచిపెట్టారు. దీంతో కోనసీమలోని గోదావరి నది పాయలు మరింత జోరుగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనం పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. పంటలు నీటమునిగాయి.
నదీ గర్భంలో కలిసిపోతున్న భూములు: కోనసీమ జిల్లాలోని పి. గన్నవరం మండలం కే ఏనుగుపల్లి లంకలోకి వెళ్లే లోతట్టు రహదారి మునిగిపోవడంతో రాకపోకలకు కష్టంగా మారింది. పి గన్నవరంలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది. మామిడికుదురు మండలం అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నం లంక, అయినవిల్లి మండలం వీరవెల్లిపాలెం, అయినవిల్లిలంక, పల్లపులంక, శానపల్లిలంక, అద్దంకి వారిలంక, ఊడిమూడిలంక, బూరుగులంక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.. లంక భూములు కోతకు గురై నదీ గర్భంలో కలిసిపోతున్నాయి.
అంతకంతకు పెరుగుతోన్న వరద తాకిడి: కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో లంకగ్రామాలకు గోదావరి వరద తాకిడి అంతకంతకు పెరుగుతోంది. ఠాణేలంక, కూనలంక, గురజాపులంక, గేదెల్లంక, చింతపల్లి లంకలో నివాసగృహాలను వరదనీరు చుట్టుముట్టింది. దారులన్నీ నీటమునిగాయి. జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లంక భూముల్లో ఉన్న పశువులను గట్టుపైకి చేర్చారు. పందెం కోళ్లను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఆనపకాయ లాంటి పంటలను నాటు పడవలపై మార్కెట్కు తరలిస్తున్నారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు: ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ పోలవరం మండలాలలో ముంపు ప్రాంతాలను.. కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పరిశీలించారు. ముంపుబారినపడిన గురజాపులంక.. చిన్న కొత్తలంక, కమిని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. పునరావాస కేంద్రాలకు తరలించేందుకు 3 మండలాల్లో 20 ముంపు ప్రాంతాలను గుర్తించామని.. 110 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెవెన్యూ.. పోలీస్ సిబ్బంది సహకారంతో ప్రజలకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామన్నారు.
నిలిచిన రాకపోకలు: రాజోలు నియోజకవర్గంలోని అప్పనారామునిలంక ౼ టెకిశెట్టిపాలెం ఉన్న నదీపాయపై ఉన్న వంతెన చుట్టూ.. కొత్తలంక కాజ్‌వే పైకి వరదనీరు చేరి.. రాకపోకలు నిలిచిపోయాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వే పైకి వరద నీరు చేరింది. రాజోలు పరిధిలో ఏటి గట్లు బలహీనంగా ఉన్నచోట ఇసుక బస్తాలు ఏర్పాటు చేశారు. మలికిపురం మండలం పెద్దతిప్ప, సఖినేటిపల్లి వద్ద వరద నీరు వెనక్కి రాకుండా ఇసుక బస్తాలు ఉంచారు. కాజ్ వేలు నీటమునిగి పడవలను ఏర్పాటు చేశారు.
ఆవేదనలో రైతులు: గోదావరి వరద పోటుతో లంక గ్రామాల్లోని ఉద్యాన పంటలు ముంపుబారినపడ్డాయి. అరటి, బొప్పాయి తోటలతో పాటు కూరగాయాల పండించే పొలాలన్నీ నీటమునిగాయి.కొత్తపేట పరిధిలోని బొడెపాలెంలో పెద్దఎత్తున పంటలను నీటిగుప్పిట చిక్కుకున్నాయి. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టామన్న రైతులు.. పంటలన్నీ గోదారి పాలు అయ్యాయని ఆవేదన చెందుతున్నారు.