FLOODS: గోదావరి వరద ముంపులో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలకరించేవారు కరవై, జల దిగ్భందం నుంచి బయటపడాలన్న సరిపడా పడవలు లేక ఆందోళన చెందుతున్నారు. తాగునీరు అందక, వంటకు జాగా లేక పస్తులు ఉంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 18 మండలాలకు సంబంధించి 75 లంక గ్రామాలు ఉంటే వాటిలో 36 లంక గ్రామాలపై వరద ఉగ్రరూపం చూపించింది . వరదకు వర్షపు చినుకులు తోడైన వేళ తలదాచుకోవడానికి బాధితులు మరింత ఇబ్బంది పడుతున్నారు. నిండా మునిగిన ప్రజలు.. ప్రాణాలు కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు.
కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని (FLOODS) లంక గ్రామాల్లో.. పంట పొలాలు పూర్తిగా నీటి మునిగాయి. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లోని లంక గ్రామాల్లో కూరగాయలు, అరటి, కంద పంటలు నాలుగు రోజులుగా నీటిలోనే నానుతున్నాయి. కూరగాయల పంటలు పూర్తిగా పాడైపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడుగువాని లంక దాదాపు వరద నీటిలో మునిగిపోగా..అక్కడ ప్రజల పడవల ద్వారా బయటపడ్డారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన, ఐ. పోలవరం, తాళ్లరేవు మండలాల్లోని లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇంటిలోని వస్తువులను వరద నీటి నుంచి కాపాడుకునేందుకు నానాయతన పడుతున్నారు. పాడి పశువుల్ని ప్రాణాలతో దక్కించుకునేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గూడుచెదిన వారంతా గుడారాల్లోనూ... కింది అంతస్తు మునిగిన వారంతా.. డాబాల మీదకు చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
మంత్రి పినిపే విశ్వరూప్ పై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఉన్న శ్రద్ధ వరద సమయంలో కనబడదా అని నిలదీశారు. కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతమైన లంకల గన్నవరంకు వెళ్లిన మంత్రి బాధితుల నుంచి ఆగ్రహావేశాలు ఎదుర్కొన్నారు. మూడు రోజులుగా వరద నీటిలో నానుతున్నామని కనీసం(FLOODS) మంచినీళ్లు అయిన సక్రమంగా పంపిణీ చేయలేదన్నారు. పాలు లేక పిల్లలు అల్లాడిపోతున్నారని ఆవేదన చెందారు .దీంతో తక్షణమే ఆహార పొట్లాలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు .