Fishermen Protest : జీవనోపాధిని కోల్పోతున్నామని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మత్స్యకారులు నిరసన తెలిపారు. కోనసీమ జిల్లాలోని గంగవరం మండలానికి చెందిన కోటిపల్లి గ్రామపంచాయతీ పరిదిలో మత్స్యకారులు నిరసన చేపట్టారు. గోదావరి నదికి అడ్డుకట్ట వేసి అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టారని.. దానివల్ల తాము ఉపాధి కోల్పొయామని పడవలపై ఎక్కి నిరసన తెలిపారు. గౌతమి గోదావరి నదికి అడ్డుకట్ట వేసి ఇసుక తవ్వకాలు చేపట్టటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నదిలో అడ్డుకట్ట వేసి ఇసుక మాఫియా చేస్తున్న అక్రమ దందాల వల్ల దాదాపు 18 వేల మంది కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని వాపోయారు.
గౌతమి గోదావరి నది పరివాహక ప్రాంతలోనే కాకుండా.. ఎన్జీటీ జియోగ్రాఫికల్ కోస్టల్ ఏరియాగా గుర్తించిన గోదావరి నది పరివాహక ప్రాంతలోను అడ్డుకట్ట వేశారని అన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ కిలోమీటర్ల మేర పెద్ద పెద్ద పైపులతో అడ్డుకట్టలు నిర్మించి ఇసుక తరలిస్తున్నారని అన్నారు. దీనివల్ల వరదలు వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.