కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురంలో రైతులు పంట విరామం ప్రకటించిన నేపథ్యంలో వారితో చర్చలకు అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. సర్పంచి మోకా రామారావు అధ్యక్షతన డీసీసీబీ మాజీ డైరెక్టర్ పెయ్యల చిట్టిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ సమావేశంలో రైతులు పలు సమస్యలపై నిలదీశారు.
మండల వ్యవసాయాధికారి ప్రశాంత్‌కుమార్ ఒక్కరే హాజరుకావడంతో మురుగు, పంట కాలువలకు సంబంధించి అధికారులు రాకుంటే.. డ్రెయిన్ల సమస్యల పరిష్కారానికి ఎవరు హామీ ఇస్తారని రైతులు ప్రశ్నించారు. సమన్వయ లోపంతో వారు రాలేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు చేపట్టాలని, ప్రభుత్వం పంట నష్టపరిహారం, బీమాలను సకాలంలో చెల్లించి ఆదుకుంటుందని చిట్టిబాబు రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారు. పెట్టుబడికి, ప్రభుత్వం అందించే పరిహారానికి సంబంధం ఉండడం లేదని, సాగు ఎలా చేపట్టగలమని రైతులు ప్రశ్నించారు.