ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

UNTIMELY RAINS: వేసవిలో అకాల వర్షం..చి'వరి'కి రైతుకు కన్నీళ్లే - ఏపీ అన్న‌దాత న‌డ్డి విరిచిన అకాల వ‌ర్షాలు

UNTIMELY RAINS DAMAGE CROPS: గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోనసీమ, కాకినాడ జిల్లాలో వరి కోతలు పూర్తై రోజులు గడుస్తున్నా ధాన్యం కొనే దిక్కు లేకపోవటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అకాల వర్షాలతో  దెబ్బతిన్న పంటలు
UNTIMELY RAINS DAMAGE CROPS

By

Published : Apr 25, 2023, 10:28 AM IST

వేసవిలో అకాల వర్షం..చి'వరి'కి రైతుకు కన్నీళ్లే

UNTIMELY RAINS DAMAGE CROPS : అసలే గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న ధాన్యం రైతుల పరిస్థితి మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా తయారైంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం రైతులు పూర్తిగా నష్టపోయారు. కోనసీమ, కాకినాడ జిల్లాలో వరి కోతలు పూర్తై రోజులు గడుస్తున్నా ధాన్యం కొనే దిక్కు లేకపోవటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం.. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు :ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కాకినాడ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వరి పైర్లు నేలకొరిగాయి. మరి కొన్ని చోట్ల కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిచిపోయింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని కౌలు రైతులు వేల ఎకరాల్లో వరి చేశారు. నీటి ఎద్దడి కారణంగా పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఎకరానికి 40 బస్తాలు పండే పొలాల్లో పాతిక బస్తాల దిగుబడి కూడా రావటం కష్టమేందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో వర్షానికి తడిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదంటున్నారు.

జాతీయ రహదారిపై ధాన్యం.. తడిచిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి :కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కోతలు పూర్తై కొనుగోలు కేంద్రానికి తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం అకాల వర్షాలకు పూర్తిగా తడిచిపోయింది. రాజోలు, మలికిపురం, మామిడికుదురు మండలాల్లో కోసిన ధాన్యాన్ని రైతులు జాతీయ రహదారిపై ఆరబోశారు. కోతలు పూర్తై రోజులు గడుస్తున్నా కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటంతో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు ఆరబోసిన ధాన్యం తడిచిపోవటంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నామని రైతులు అంటున్నారు. మిల్లర్లు సైతం తడిచిన ధాన్యాన్ని పూర్తిగా ఆరబెడితేకానీ తీసుకెళ్లలేది లేదని తేల్చి చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త విధానంతో తాము తీవ్రంగా నష్ట పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిచిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి త్వరగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలని కలెక్టరేట్‌ ముందు ధర్మా : తడిచిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని అమలాపురం కలెక్టరేట్‌ ముందు మాజీ ఎమ్మెల్యే బత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

" ధాన్యం కోసి 15 రోజుల అయ్యింది. ప్రభుత్వం కానీ దళారులు కానీ ధాన్యాన్ని కొనడానికి ముందుకు రావడం లేదు. తేమ శాతం ఉందని ముందుకు రావటం లేదు. ప్రభుత్వం ఎలాంటి సహాయం లేదు. " - రైతులు

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details