మంత్రికి వ్యతిరేకంగా కార్యకర్తల తీర్మానం Differences between YSRCP Leaders: రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వేణుకు వ్యతిరేకంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు వెంకటాయపాలెంలో భారీ సభ నిర్వహించారు. బోస్ అనుచరులైన మాజీ జడ్పీటీసీ ఇంత సంతోషం, పోలినాట ప్రసాద్ ఆధ్వర్యంలో.. నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం పేరిట సభ ఏర్పాటు చేశారు. బోస్ వర్గీయులు సుమారు 2 వేల 500 మంది హాజరై మంత్రి వేణుగోపాలకృష్ణపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గత ఎన్నికల్లో తమకు ఇష్టం లేకపోయినా బోస్ మాట కాదనలేక వేణును ఎమ్మెల్యేగా గెలిపించినట్లు వారు వివరించారు. మంత్రి వేణు, ఆయన కుమారుడు రాజ్యాంగేతర శక్తిగా మారారని ధ్వజమెత్తారు. మంత్రి కుమారుడు పలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఇసుక దోపిడీ, భూ కబ్జాలు చేస్తున్నారని బోస్ అనుచరులు ఆరోపించారు. ఆయన ఉపయోగిస్తున్న 123 నెంబర్ కారు రాజోలుకి చెందిన వ్యక్తి ఇచ్చేందేనని.. దానికి డీజిల్ మున్సిపాలిటీ ఖాతాలో కొట్టేస్తున్నారని ఆరోపించారు.
మంత్రి వేణు నియోజకవర్గంలో శెట్టిబలిజల్ని, వైఎస్సార్సీపీ కార్యకర్తల్నిఅణిచివేస్తున్నారని ఎంపీ వర్గీయులు ఆరోపించారు. బోస్ కుమారుడు సూర్యప్రకాశ్‌కు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తీర్మానించారు. ఒకవేళ మంత్రి వేణుకు టికెట్ ఇచ్చినా.. పిల్లి సూర్యప్రకాష్‌ను స్వతంత్ర అభ్యర్థిగా గెలిపిస్తామని ప్రకటించారు.
ఈనెల 26న అమలాపురం సభకు రానున్న ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి.. తాము చేసిన తీర్మానం గురించి ఆయనకు వివరిస్తామన్నారు. ఈ సభ గురించి విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి వేణుగోపాలకృష్ణను మీడియా ప్రశ్నించగా.. రామచంద్రపురం సీటు తనదేనని ఆయన చెప్పారు. ఈ విషయం జగనే చెప్పారన్నారు. బోస్ మాట్లాడి ఉంటే తాను స్పందించేవాడినని.. మిగిలిన వారు ఎవరు మాట్లాడినా స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వేణుగోపాలకృష్ణకు వ్యతిరేకంగా ఎంపీ సుభాష్ చంద్రబోస్ వర్గీయులు మరోసారి గళమెత్తారు. మంత్రి వేణు తమ కుమారుడితో అక్రమాలకు పాల్పడుతున్నారని, వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వేణుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఓడించి తీరుతామని తేల్చి చెప్పారు. ఈ సారి బోస్ కుటుంబానికి ముఖ్యంగా ఆయన కుమారుడికే వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇవ్వాలని భారీ సమావేశం నిర్వహించి తీర్మానించారు.
"చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు.. కార్యకర్తలపై కేసులు పెడుతూ ఎన్నో ఇబ్బందులను పెడుతున్నారు. అతను అవినీతి చేస్తూ.. ఇతరులపై కేసులు పెట్టడం చాలా తప్పు. తిరుమల తిరుమతి దేవస్థానం టికెట్స్ విషయంలో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. అతని అవినీతిని వెంకటేశ్వర స్వామి నుంచే మొదలుపెట్టారు". - ఎంపీ సుభాష్‌చంద్రబోస్ వర్గీయులు